శ్రమల కోసమని తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు గత నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలోని నిజాం షుగర్ పరిశ్రమకు చెందిన 170 ఎకరాల భూమితోపాటు, మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటూ వెయ్యి ఎకరాల వరకు భూమిని సేకరించారు. అయితే ఈ భూముల్లో ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రైతులు ఆందోళనలు చేస్తున్నారు.పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో పరిశ్రమలే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పరిగిలో 1977ా78 ప్రాంతంలో 170 ఎకరాల విస్తీర్ణంలో నిజాం షుగర్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇందులో రైతుల నుంచి సేకరించింది 120 ఎకరాలు కాగా, మరో 25 ఎకరాలు దేవాదాయ భూమి, మిగిలిన 25 ఎకరాలు ప్రభుత్వ భూమి. పరిశ్రమలో 1982 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తరువాత నష్టాలు రావడంతో మూతపడింది. అనంతరం 1998లో ఈ పరిశ్రమను రేణుకా షుగర్ కొనుగోలు చేసింది.
అయితే ఇక్కడ పరిశ్రమను నడపకుండా 1999లోనే ప్లాంట్‌ను మరోచోటుకు తరలించారు. అనంతరం ఆ సంస్థ 2004లో ఈ స్థలాలను అమ్మకానికి పెట్టింది. 2006లో ఈ భూమిని రసోయి ప్రాపర్టీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ భూములతోపాటు చుట్టుపక్కల ఉన్న మరో 600 ఎకరాల వరకు పరిశ్రమల కోసమని 2006లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదు. తాజాగా నిజాం షుగర్ పరిశ్రమకు సంబంధించిన భూముల్లో ప్లాట్లు వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో పరిశ్రమలనే నెలకొల్పాలని, లేకపోతే తమ భూములను తమకు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తోన్న రైతులు... గత నాలుగు నెలలుగా ఆందోళనబాట పట్టారు.పరిశ్రమలకు సంబంధించిన భూముల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రైతులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో 20 రోజులకుపైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే ప్లాట్లు వేసేందుకుగాను భూములను చదును చేసే కార్యక్రమాన్ని రసోయి ప్రాపర్టీస్ చేపట్టింది. దీన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిపై తమ నిరసనను రైతులు కొనసాగిస్తూనే ఉన్నారు.
తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటయితే స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలస్తాయని ఆశించి భూములివ్వడం జరిగింది. ఈ పేరుతోనే తమ నుంచి అధికారులు ఆనాడు బలవంతంగా భూములను సేకరించారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తే భూములు కోల్పోయిన ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి దొరకదు. కాబట్టి పరిశ్రమలైనా పెట్టండి, భూములైనా తిరిగివ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నాం.పరిశ్రమ ఏర్పాటు కోసమని తీసుకున్న భూముల్లో తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమే 56 ఎకరాలు పోయింది.
పరిశ్రమలస్తాయని ఆశించాం. నిజాం షుగర్ భూముల్లోని పది ఎకరాల్లో ఇండియన్ గార్మెంట్స్ పరిశ్రమ పెడితే తామెవరమూ అడ్డుకోలేదు. అందరూ స్వాగతించారు. ఎందుకంటే దీనివల్ల ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి లభిస్తుందని. కాని ఇప్పుడు వెంచర్ వేసి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కూడా పరిశ్రమలు పెడితే అభ్యంతరం లేదు. పరిశ్రమల కోసం తీసుకున్న భూమిలో వ్యాపారం చేస్తే తాము అంగీకరించం. మా భూములు మాకు తిరిగివ్వాల్సిందేనని చెబుతున్నారు.