YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

వ్యాఖ్యలు తలనొప్పిగా మారుతున్నాయా

వ్యాఖ్యలు తలనొప్పిగా మారుతున్నాయా

అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయంగా విబేధాలకు దారి తీస్తూ ఉంది. రామమందిర నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు విరాళాలు సేకరిస్తూ ఉండగా.. కొందరు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా అయోధ్య చందా విషయంలో చాలా ఇబ్బందులే తలెత్తుతూ ఉన్నాయి. అయోధ్య చందా సేకరణ కార్యక్రమంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. మరికొందరు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఓ స్పష్టమైన ఆదేశమేదీ రాకపోవడంతో కొందరు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. రామమందిర నిర్మాణానికి విరాళాల కోసం బీజేపీ నేతలు చేస్తున్న ఇంటింటి యాత్రపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు? మన వద్ద రాముడి ఆలయాలు లేవా? అని వ్యాఖ్యానించారు. అయోధ్య రాముడికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. రాముడి పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటకానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా? అని ప్రశ్నించారు.  ఉత్తరప్రదేశ్‌లో రామాలయం నిర్మిస్తే మనమెందుకు విరాళాలు ఇవ్వాలని అన్నారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.  తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని వివరించారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తున్నారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. తాను కూడా రాముడి భక్తుడినే అని, తాను కూడా అయోధ్య వెళతానని చెప్పుకొచ్చారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. అయోధ్య రామాలయానికి విరాళాలు ఎందుకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తిరుపతి వెళ్లి ఎందుకు విరాళమిచ్చారో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు రామాలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం ఇచ్చారని, ఇది తెలుసుకుని ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిగ్గుతో తలదించుకోవాలన్నారు.ఇప్పుడు మరో టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి శనివారం కరీంనగర్‌లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రాజ్యాంగ రక్షణ సదస్సు'లో  మాట్లాడుతూ.. నిన్నమొన్నటి నుంచి చందాల దందా మొదలైందని, అయోధ్య రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో జై భీమ్‌– జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందన్నారు.విరాళాల వసూలు బిజెపి పార్టీ కార్యక్రమంలా సాగుతూ ఉండడంతో టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. అందర్నీ కలుపుకుని దైవ కార్యక్రమంలా బిజెపి నేతలు ముందుకెళ్ళడం లేదని.. చాలా చోట్ల బిజెపి నేతలు మాత్రమే ఇంటింటికి తిరుగుతూ ఉండడంతో వ్యతిరేకత వస్తోంది. ఇక రామమందిరం నిర్మాణానికి మద్దతుగా ఆంధోల్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తనే స్వయంగా విరాళాల సేకరించారు. మొత్తానికి అయోధ్య రామమందిరానికి విరాళాల సేకరణ తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసింది.

Related Posts