హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలతోపాటు శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ తిరుమల హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతోందని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో మంగళవారం ఉదయం 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన జాతీయ నాయకుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుమలలో చేపడుతున్న విశ్రాంతి గృహాల మరమ్మతులు, ఉద్యానవనాలు, పరకామణి భవనం,పోటు భవన నిర్మాణంతోపాటు అలిపిరి కాలిబాట పైకప్పు పునర్నిర్మాణ పనులు ఈ ఏడాదిలోనే పూర్తవుతాయని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పించామని, ఇందుకోసం ఒక సంవత్సర కాలం పాటు జీయర్‌స్వాములు, ఆగమసలహాదారులు, పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు నివాసముండే వైకుంఠంలో 12 గంటల సమయం ఉత్తరాయన పుణ్యకాలంలో మానవులకు 6 నెలలకు సమానమని, ఆ తర్వాత 12 గంటలు దక్షిణాయన పుణ్యకాలంలో 6 నెలలు సమానమని తెలియజేశారు. ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారు 33 మంది దేవతలతో 40 నిమిషాల పాటు ఆస్థానం నిర్వహిస్తారని, ఈ సమయం భూలోకంలో 10 రోజులకు సమానమని చెప్పారు. దేశంలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరంగంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవడానికి ఇదే కారణమని తెలియజేశారు. అన్ని పురాణ గ్రంథాలను పరిశీలించిన అనంతరం తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వారం తెరిచి 4.26 లక్షల మందికి దర్శనభాగ్యం కల్పించినట్టు వివరించారు.
పరకామణి ప్రక్రియను భక్తులు వీక్షించేందుకు వీలుగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమరుస్తూ రూ.8.90 కోట్లతో పరకామణి భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. పోటులో రోజుకు 7.50 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు వీలుగా అధునాతన 40 బర్నర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్వీ మ్యూజియంలో స్వామివారి ఆలయ దర్శన అనుభూతిని కల్పించేరీతిలో గ్యాలరీలు, శ్రీవారి ఆభరణాల నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యానవనాలను అభివృద్ధి చేయడంతోపాటు రూ.120 కోట్లతో విశ్రాంతి గృహాల మరమ్మతులు చేపడుతున్నట్టు చెప్పారు.
శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత తిరుమలలో దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడిందని, భక్తుల ఆదరణతో ఈ ట్రస్టు విరాళాలు రూ.100 కోట్ల మార్కుకు చేరుకున్నాయని తెలిపారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో యోగవాశిస్టంతోపాటు సుందరాండ పారాయణం, విరాటపర్వం, గీతాపారాయణం, వేదపారాయణం ప్రారంభించామన్నారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి విశేష ఆదరణ లభించిందన్నారు. ఈ కారణంగానే జూలైలో ప్రారంభించిన ఎస్వీబీసీ ట్రస్టుకు ఇప్పటివరకు రూ.16 కోట్ల విరాళాలు అందాయని, భవిష్యత్తులో ఈ ఛానల్ స్వయం సమృద్ధి సాధించేదిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు విశేష సేవలందిస్తున్న టిటిడిలోని సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదేస్ఫూర్తితో సంస్థకు కీర్తిప్రతిష్టలు తెచ్చేలా సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, ఎస్‌ఇ-2 నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, డిఎఫ్‌వో చంద్రశేఖర్, డెప్యూటీ ఈవోలు బాలాజీ, నాగరాజ, సెల్వం, విజయ సారధి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.