నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్ధతుగా, రైతుల ట్రాక్టర్ పెరేడ్ కు సంగిభవంగా మంగళవారం విశాఖలో వివిధ రాజకీయ, ప్రజా, పౌర, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.
జీవీఎంసీ గాంధీ విగ్రహాం వద్ద ప్రారంభమైన ర్యాలీ రామాటకిస్ రోడ్డు, రేసపువాణిపాలెం, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, గురుద్వారా, సీతంపేట,ఆర్టీసీ కాంప్లెక్స్, అంబెడ్కర్ సర్కిల్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహాం వరకు జరిగింది.ర్యాలీ పొడవునా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు చేతభూని ప్రదర్శన సాగింది.
అనంతరం జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు తీవ్ర విఘాతం కలిగించే ఈ చట్టాల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా ఈ చట్టాల రూపకల్పన చేశారని దుయ్యబట్టారు. చట్టాలు అమలు జరిగితే రైతులే కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. నేడు రైతులు చేస్తున్న ఉద్యమం ఒక్క వారికే కాకా యావత్ భారతవనికే చెందుతుందన్నారు. కరోనా సంక్షోభంలో దేశం ఉన్న తరుణంలో మూజువాణి ఓటుతో చట్టాల రూపకల్పన చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతు ఉద్యమానికి దేశం మొత్తం సంగిభావం తెలుపుతోందని రాజకీయాలకు అతీతంగా నేడు ఉద్యమాలు జరుగుతున్నాయని మున్ముందు ఈ పోరాటాన్ని ఉదృతం చేయాలని విజ్ఞప్తి చేశారు.బీజేపీ ప్రభుత్వం పలుమార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారని అందులో ప్రధానంగా నూతన వ్యవసాయ చట్టాల అమలు తాత్కాలికంగా వాయిదా వేస్తామని కేంద్రం ప్రకటించడం సరైంది కాదని పూర్తి స్థాయిలో ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నగర కార్యదర్శి
ఎం పైడిరాజు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి,ఎ పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఏ నారాయణ రావు, సీపీఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి ఎం లక్ష్మీ, ఎంసీపీఐ యు నాయకుడు కె శంకరరావు,ఎ పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, ఎ పి మహిళా రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షురాలు ఎ విమల,పి ఒ డబ్ల్యు జిల్లా నాయకురాలు రోహిణి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సీహెచ్ మసేన్,ఇఫ్టూ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరులు,వివిధ పార్టీల నాయకులు ఎస్ వెంకటేశ్వరరావు, ఎ జె స్టాలిన్, వై కొండయ్య తదితరులు ప్రసంగించగా సీపీఐ,కాంగ్రెస్,సీపీఐ ఎం ఎల్, ఎం సీపీఐ యు, ఏఐటీయూసీ, ఇఫ్టూ,జాతీయ బ్యాంకులు ఉద్యోగులు,కేజీహెచ్ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు దళిత, మహిళా,యువజన, విద్యార్థి సంఘాల నాయకులు కె సత్యాంజనేయ, బివెంకటరావు, కె సత్యనారాయణ, ఎస్ కె రెహమాన్,జి రాంబాబు,జి వామనమూర్తి,ఆర్ శ్రీనివాసరావు, పి చంద్రశేఖర్, రోహిణి,దేముడమ్మ, బాలనాగమ్మ,జి పనీంద్ర,నాగరాజు, మన్మధరావు,ఏఐటీయూసీ నాయకుడు జె డి నాయుడు తదితరులు పాల్గొన్నారు.