విజయవాడ, జనవరి 27
గ్రామ పంచాయతీలకు జగన్ సర్కారు బంపరాఫర్ ప్రకటించింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. జనాభాను బట్టి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.గత ఏడాదే ఏకగ్రీవాలు అయిన పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 5 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5 వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొంది.ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఎలాంటి ఎన్నిక జరగకుండా ప్రజలంతా ఒక్క మాటపై నిలబడి సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోవడాన్నే ఏకగ్రీవం అంటారు. అంటే, ఊరి ప్రజలంతా చర్చించుకుని.. చివరికి ఒకే అభిప్రాయానికి వచ్చి తమ గ్రామ నాయత్వాన్ని ఎన్నుకోవడం. దీని వల్ల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు, ప్రచారానికి చేసే ఖర్చులు లేకుండా పోతాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా గొడవలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి.. జగన్ ప్రభుత్వం వీటిని నిలువరించేందుకు ఏకగ్రీవాలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.