YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆదానీకి విశాఖ పోర్టు నోటీసులు

ఆదానీకి విశాఖ పోర్టు నోటీసులు

విశాఖపట్టణం, జనవరి 28, 
అదానీ నాటకానికి వైజాగ్‌ పోర్టు అధికారులు చెక్‌ పెట్టారు. మూడేళ్లుగా కార్గో చేయకుండా తాత్సారం చేస్తుండడంతో అధికారులు డి-ఫాల్టర్‌ నోటీసు ఇచ్చారు. 2011లో పోర్టులోని ఇన్నర్‌ హార్బర్‌లో క్యూ1 బెర్తును గౌతమ్‌ అదానీ తీసుకున్నారు. ఈ బెర్తుకు స్టీమ్‌ కోల్‌ దిగుమతి అయ్యేది. దీని సామర్థ్యం 6.41 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. దిగుమతి అయిన కోల్‌ విలువలో 40 శాతాన్ని పోర్టుకు ఇవ్వాలి. గడిచిన మూడేళ్లుగా ఈ బెర్తు నుంచి కార్గో హేండ్లింగ్‌ చేయడం లేదు. ఈ బెర్తును ఇప్పుడు వదిలించుకొని అప్పు బకాయి మొత్తాన్ని పోర్టుపై రుద్దాలని అదానీ వేసిన స్కెచ్‌ను అధికారులు డి-ఫాల్టర్‌ నోటీసు ఇవ్వడం ద్వారా అడ్డుకున్నారు. ఈ నోటీసుపై ఆర్బిట్రేషన్‌కు అదానీ వెళ్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 20న ఈ చర్చలు ఉంటాయని తెలిసింది. పోర్టు నుంచి కూడా లాయర్లను ఏర్పాటు చేసే పనిలో పోర్టు అధికారులు ఉన్నట్లు సమాచారం.
పోర్టులో బెర్తు తీసుకున్న ప్రతి ప్లేయర్‌ కూడా మినిమం గ్యారెంటీ కార్గో  నిబంధనల ప్రకారం సరుకు రవాణా లావాదేవీలను నిర్వహించాలి. క్యూ1 బెర్తు తీసుకున్న అదానీ 2017 వరకు మాత్రమే దీనిని ఉపయోగించారు. ఆ తర్వాత నుంచి ఖాళీగా ఉంచుతూ వస్తున్నారు. దీనిపై గడిచిన మూడేళ్లలో అదానీకి వైజాగ్‌ పోర్టు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. బెర్తును వినియోగించాలని సూచించినా పట్టించుకోలేదు. కరోనా సాకును చూపి ఈ బెర్తును ఇప్పుడు వదిలి వెళ్లిపోయి, అప్పు భారాన్ని పోర్టుపై మోపాలని ఎత్తుగడ వేశారు. దీనిలో భాగంగా తనను పోర్టు నుంచి టెర్మినేట్‌ చేయాలంటూ 2020 అక్టోబర్‌ ఎనిమిదిన వైజాగ్‌ పోర్టుకు లేఖ రాశారు. కరోనా కారణంగా వ్యాపారం చేయలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. డి-ఫాల్టర్‌ నోటీసు ఇవ్వకుండా నేరుగా టెర్మినేట్‌ చేస్తే, క్యూ1 బెర్తు నిర్మాణం కోసం ఐసిఐసిఐ బ్యాంకు నుంచి అదానీ తీసుకున్న వందల కోట్ల రూపాయల రుణాన్ని వంద శాతం పోర్టే బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. పోర్టుకు నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే తనను టెర్మినేట్‌ చేయాలని అదానీ లేఖ రాసినట్లు అధికారులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో, అదానీ విజ్ఞప్తిని మన్నించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తొలుత డి-ఫాల్టర్‌ నోటీసు ఇచ్చారు. అనంతరం టెర్మినేట్‌ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల ఐసిఐసి బ్యాంకుకు అదానీ ఉన్న అప్పు బకాయిలో 80 శాతం మాత్రమే పోర్టు తీర్చాల్సి ఉంటుంది. అదానీ అప్పు చేసి నిర్మించిన క్యూ1 బెర్తును ఎటువంటి పరిహారమూ చెల్లించకుండానే పోర్టు స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వైజాగ్‌ పోర్టులో మొత్తం 26 బెర్తులు ఉన్నాయి. వీటిలో ఇన్నర్‌ హార్బర్‌లో 20, అవుటర్‌ హార్బర్‌లో ఆరు నిర్మించారు. అవుటర్‌లోని నాలుగు, ఇన్నర్‌లోని నాలుగు బెర్తులు ప్రయివేట్‌ ప్లేయర్ల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఒక్క అదానీ బెర్త్‌ మినహా మిగిలిన 25 బెర్తుల్లోనూ కార్యకలాపాలు సాగుతున్నాయి.2016లో అదానీ సంపద 3.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కరోనా సమయం (2019-20) లో చాలా వ్యాపారాలు దెబ్బతినగా, అదానీ మాత్రం 21.1 బిలియన్‌ డాలర్లను ఆర్జించారని బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక వెల్లడించింది. ఇది అంబానీ వార్షికాదాయం కంటే ఎక్కువ. అంబానీ సంపద 75.8 బిలియన్‌ డాలర్లు ఉండగా, రెండో సంపన్నుడిగా ఎదిగిన గౌతమ్‌ అదానీ సంపద 35.2 బిలియన్‌ డాలర్లు. ఇటీవలే ఆరు విమానాశ్రయాల నిర్వహణ బిడ్డింగ్‌ను కూడా చేజిక్కించుకున్నారు. అదానీ సంస్థ ఎయిర్‌ పోర్టుల కోసం రూ.350 బిలియన్లను ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే దేశంలో అతిపెద్ద ఎయిర్‌ పోర్టు ఆపరేటర్‌గా అదానీ నిలవనున్నారంటూ ఆంగ్ల మీడియా కోడై కూస్తోంది. అదానీ పోర్ట్సు స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (గుజరాత్‌) కూడా పూర్తిగా లాభాల్లో ఉంది.

Related Posts