YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై నీలి నీడలు

మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై నీలి నీడలు

విజయవాడ జనవరి 28 
ఏపీలో గవర్నర్ ఆమోదం పొంది హైకోర్టులో బ్రేక్ పడిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై ఏడాది దాటినా కూడా దానిపై ఎటూ తేలడంలేదు.ప్రభుత్వం మంత్రులు వైసీపీ ఎమ్మెల్యే లు త్వరలో విశాఖకి తరలించడం ఖాయం  అని చెబుతున్నా ఉద్యోగులను ఆ మేరకు సన్నద్ధం చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర హైకోర్టు ఛీఫ్ జస్టిస్ బదిలీ కావడం కొత్త సీజే వచ్చినా ఇంకా రాజధాని పెండింగ్ కేసుల విచారణ ప్రారంభం కాకపోవడంతో రాజధాని తరలింపుపై మరోసారి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
దీనితో  పాటు ఇప్పటికే మొదలైన స్ధానిక సంస్దల ఎన్నికల ప్రక్రియ మార్చినెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉండటం రాజధాని తరలింపుపై ప్రభావం చూపబోతోంది. అటు కేంద్రం నుంచి కూడా సహకారం లేకపోవడం ఈ వేసవిలో రాజధాని తరలింపుపై అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. గవర్నర్ ఆమోదించి పంపిన సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేయడంతో మొదలైన విచారణ తాజాగా జరిగిన ఛీఫ్ జస్టిస్ బదిలీ వరకూ నిరాటంకంగా సాగింది. ఈ క్రమంలో తుది తీర్పు వచ్చేస్తుందని అంతా ఆశిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా సీజే బదిలీ అయ్యారు. కొత్త సీజే అరూప్ గోస్వామి తాజాగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోని హైకోర్టు ప్రధాన బెంచ్ రాజధాని పిటిషన్ల విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే దీనికి ముందే అసలు రాజధాని సమస్యకు మూలాలు పిటిషన్ల నేపథ్యం వంటి వాటిని ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో ఈ కేసుల విచారణ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మొదలైనా ఏప్రిల్ లోపు పూర్తవుతుందా అంటే అనుమానమే. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం ఫిబ్రవరి చివరి వరకూ ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి ముగియగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అవి ముగిశాక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఇలా మార్చి నెలాఖరులో ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీ విరమణ చేసే వరకూ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి అని కొందరు అనుకుంటున్నారు. వీటి మధ్యలో రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసేందుకు వీల్లేదు. ఎస్ ఈసీ అనుమతితోనే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో అదీ సాధ్యమయ్యేలా లేదు. దీనితో ఇప్పట్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోవచ్చు.అమరావతి నుంచి విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించాలన్నా కర్నూలుకు హైకోర్టు తరలించాలన్నా కేంద్ర ప్రభుత్వం రీ నోటిఫై చేయాల్సి ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా తిరిగి న్యాయస్ధానాలు ఇచ్చే తీర్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో న్యాయస్దానాలు కూడా ఇలాంటి కీలక అంశాలపై తీర్పులు ప్రకటించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ఎన్నికల సంఘం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. అందుకే కేంద్రం కూడా మౌనం వహిస్తోంది. మొత్తం పరిస్థితులని ఒకసారి గమనిస్తే ఈ మూడు రాజధానుల అంశం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Related Posts