- బిజెపి కి బాలయ్య అభిమానుల వార్నింగ్...
నిన్న మొన్నవరకు సిని నటులు ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటే అది కాస్త ముదిరి పాకాన పడి అభిమానులవరకు వెళ్ళింది.అభిమానం వార్నింగ్ ల వరకూ వెళుతోంది. సినీ హీరోల్ని అభిమానులు అభిమానించటం కొత్తేం కాదు.కానీ.. తమ అభిమాన హీరోలు ఏం చేసినా సరే.. వాటిని భరించాలే తప్పించి.. ప్రశ్నించటం.. తప్పు పట్టటం.. విమర్శించటం లాంటివి అస్సలు చేయకూడన్నట్లుగా మారుతోంది. పవన్ కల్యాణ్ ను ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.. వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూస్తున్నదే. ఇప్పుడు అదే బాటలో ప్రయాణిస్తున్నారు బాలయ్య అభిమానులు.
ఇటీవల హోదా సాధనలో భాగంగా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష సభలో బాలకృష్ణ ప్రసంగించటం తెలిసిందే. హోదా హామీని ఇచ్చిన ప్రధాని మోడీ.. తానిచ్చిన హామీని అమలు చేయకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. తన ప్రసంగంలో భాగంగా మోడీని ఉద్దేశించి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. దానిపై ఆగ్రహం చెందిన బీజేపీ నేతలు పలుచోట్ల కేసులు పెట్టటం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ చేసిన విమర్శల్ని బీజేపీ నేతలు రాద్దాంతం చేయటం సిగ్గుచేటని బాలకృష్ణ అభిమానుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు.. రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యుడు పీరయ్య ఫైర్ అయ్యారు. బాలకృష్ణ ముఖ్యమంత్రి వియ్యంకుడు మాత్రమే కాదని.. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మోడీపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎక్కడో దాక్కొని చేయలేదని.. ఓపెన్ గా.. అదీ ధర్మపోరాట దీక్షలో పాల్గొని మరీ అన్నారన్నారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగోదని.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని.. ఇప్పటికైనా చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరి.. ఈ తరహా వార్నింగ్ లపై మహేశ్ కత్తి లాంటోళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Related Posts