న్యూఢిల్లీ జనవరి 28 );: భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో రెండు షార్ట్ టర్మ్ ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీపై రెండు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించింది. ఈ స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సు వారానికి ఐదు రోజులు, ఆన్‌లైన్ క్లాస్‌తో రోజుకు రెండు గంటలు నిర్వహించనున్నారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు రెండు వేర్వేరు ఆన్‌లైన్ స్వల్పకాలిక కోర్సుల్లో ప్రవేశం పొందడానికి వీలున్నది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్వల్పకాలిక కార్యక్రమం 12 వారాల సర్టిఫికేట్ కోర్సు. ఇది ప్రాబబిలిటీ థియరీ, ప్యాటర్న్ రికగ్నిషన్, బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, డీప్ లెర్నింగ్ వంటి అంశాలను నేర్పుతుంది. ఇదే సమయంలో సైబర్ సెక్యూరిటీ కోర్సు కూడా 12 వారాల ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ కోర్సులలో ఏదైనా స్ట్రీమ్‌లో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే డీఆర్‌డీఓ నిర్వహించే ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.ఈ రెండు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 20 న జరుగుతుంది. కాగా, ఫలితం ఫిబ్రవరి 22 న విడుదల చేస్తారు. సైబర్ భద్రత ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 21 న నిర్వహించి.. ఫలితాన్ని ఫిబ్రవరి 22 న విడుదల చేస్తారు. ఒక్కో కోర్సుకు ప్రవేశ రుసుంగా అభ్యర్థులు రూ.15 వేలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రవేశ పరీక్షకు ఎటువంటి రుసుం ఉండదు. ఈ రెండు కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26 లోగా చెల్లించాల్సి ఉంటుంది.