వరంగల్, జనవరి 28,
మనిషికి పంచభూతాలు ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి బతకలేడు. ఒక మనిషి గాలి లేకుండా క్షణాలపాటు, ఆహారం లేకుండా నెలలపాటు, నీరు తాగకుండా రోజుల పాటు మాత్రమే జీవించగలుగుతాడు. కానీ, ఈ బామ్మ మాత్రం ఏకంగా పదేళ్ల నుంచి మంచి నీరు తాగడం లేదు. నిజానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా మీరు చదివేది నిజమే.జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన ఈ బామ్మ ఏకంగా పదేళ్ల నుంచి నీళ్లు తాట్లేదు.ఈ బామ్మ పేరు ప్రమీల. వయసు 70 సంవత్సరాలు. తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఈ వృద్ధురాలు ఇంట్లో వాళ్లు బతిమాలినా సరే నీటిని వద్దంటూ తిరస్కరిస్తూ వస్తోంది. పదేళ్లకు క్రితం మంచినీళ్లు బాగానే తాగేదాన్నని, తరువాత ఎందుకో నచ్చట్లేదని ప్రమీల తెలిపారు. అయితే, నీళ్లు తాగకపోయినా తనలో ఏ మార్పు లేదని చెప్పుకొచ్చారు. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ చక్కగా జీవిస్తున్నట్లు వృద్ధురాలు వెల్లడించారు.దాహం వేసినప్పుడల్లా కడుపులో నీళ్లు పడితే మనిషికి ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. అలాంటిది ఈ వృద్ధురాలు నీరు తీసుకోకుండా జీవిస్తుండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరు చెప్పినా తాను వినట్లేదని, వైద్యులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. ఏ కాలమైనా సరే తాను నీళ్లు తాగబోనని చెబుతున్నారు. అంతేకాక, ఈ బామ్మకు టీబీ కూడా ఉంది. అయినా ఎప్పుడూ హుషారుగానే ఉంటానని తెలిపారు. అయితే, రోజూ తీసుకునే ఆహారంలో నీరు ఉంటుంది కాబట్టి ఆ శాతం శరీరానికి సరిపోతుందేమో అని డాక్టర్లు చెబుతున్నారు.గతంలో చాలా సార్లు బలవంతంగా నీరు తాగించే ప్రయత్నం చేసినా బామ్మ వినలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తాగినట్లు నటించి అనంతరం ఉమ్మేస్తోందని ఆమె భర్త తెలిపారు. ఎవరు చెప్పినా తాను వినట్లేదని.. వైద్యులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పారు.