నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలను గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు . కళాశాలలో పంచాయతీ ఎన్నికల కోసం ప్రింట్ చేసిన బ్యాలెట్ పేపర్స్ ని భద్రపరిచిన స్ట్రాంగ్ రూంని పరిశీలించిన కలెక్టర్.., స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూంని, జాయింట్ కలెక్టర్ తో కలిసి పరిశీలించిన కలెక్టర్.., పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల తరలింపుపై తీసుకున్న చర్యలు, ఏర్పాట్ల డి.పి.ఓ ధనలక్షి ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సులు రెవెన్యూ డివిజన్స్ కి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జిల్లాలో 941 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని.., దానిలో భాగంగా గురువారం బ్యాలెట్ పేపర్స్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూంని సందర్శించి, బ్యాలెట్ పేపర్స్ తరలింపుపై అధికారులతో సమీక్షించామన్నారు. మొదటి దశలో కావలి డివిజన్, రెండో దశలో ఆత్మకూరు, మూడో దశలో గూడూరు, నాయుడపేట డివిజన్లు, నాలుగో విడతలో నెల్లూరు డివిజన్ లోనూ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 24, 650 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించడం జరిగిందని.., వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి డివిజన్ లోనూ స్టేజ్-1. స్టేజ్-2 అధికారులతో పాటు, నోడల్ అధికారులను నియమిస్తున్నామన్నారు. ఎన్నికలు జరగనున్న 941 గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ప్రజలకు ఎన్నికల నియమావళి పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతున్నామని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.., ప్రతి పోలింగ్ బూత్ లోనూ విద్యుత్, పవర్ సప్లై, ఇతర సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని.., పోలింగ్ బూత్ లోనే మాస్కులు, శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ఎన్నికల షెడ్యూల్ తో సమాంతరంగా, జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అమలవుతోందని, మొదటి దశలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 4న నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన ప్రభుత్వ శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.