YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా ఆరాచకాలకు ప్రజలే బుద్ది చెప్పాలి చంద్రబాబు నాయుడు

వైకాపా ఆరాచకాలకు ప్రజలే బుద్ది చెప్పాలి చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ఎన్టీఆర్ భవన్ లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,'' ఈ రోజు వైఎస్సార్ మంత్రులు, పార్టీ నాయకులు ఎందుకు ఏకగ్రీవ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారని అడగటం హాస్యాస్పదంగా ఉంది. ఇది ప్రజామోదంతో చేస్తున్న ఏకగ్రీవాలు కాదు.. ఉన్మాదులుగా మీరంతా తయారై బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని అనుకుంటుంటే, దానిని మేము స్వాగతించాల్నా..? బలవంతపు ఏకగ్రీవాలను జరగనిచ్చే ప్రసక్తేలేదు, కబర్దార్.. అన్ని గ్రామాల్లో సమర్ధవంతమైన నాయకత్వాన్ని తయారుచేసే బాధ్యత టిడిపి తీసుకుటుంది. నేను అడిగే ప్రశ్నలకు సీఎం జగన్ రెడ్డి, మంత్రులు, వైసిపి నాయకులే సమాధానం చెప్పాలి. ఇవి ప్రజల ఆమోదంతో స్వచ్చందంగా ప్రజలే చేసుకున్న ఏకగ్రీవాలా..? నయానా, భయానా బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలా...? తేల్చాలి. మీ అరాచకం, ఉన్మాదానికి ప్రజలే బుద్ది చెప్పాలి.


గత మార్చి ఎంపిటిసి, జడ్ పిటిసి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో మీరు చేసిన అరాచకం, ఉన్మాదం ఒకసారి ప్రజలకు గుర్తుచేస్తున్నాను. మీ రౌడీయిజాన్ని దేశం మొత్తం చూసింది, నడి బజారులో ప్రజాస్వామ్యాన్ని మీరు ఏవిధంగా ఖూనీచేశారో అప్పటి ఈ వీడియో క్లిప్పింగులే ఉదాహరణ అని అన్నారు.


2014 స్థానిక ఎన్నికల్లో మొత్తం 1,092 స్థానాలకు 270ఏకగ్రీవం అయితే 2020 మార్చి ఎన్నికల్లో 9,696స్థానాలకు 2,248ఏకగ్రీవం అయ్యాయంటూ, అప్పుడు  2.6% ఎంపిటిసిలు  ఏకగ్రీవం అయితే, 2020లో 23% ఏకగ్రీవం కావడం, జడ్ పిటిసిలు కూడా అప్పుడు 1మాత్రమే ఏకగ్రీవం అయితే, ఇప్పుడు 125అయ్యాయని, 0.15%నుంచి 19%కు పెరగడం వైసిపి దమనకాండ వల్లే... అప్పుడే మేము ఫిర్యాదుచేసినా, ఈ ఎన్నికల కమిషనరే ఏం చేయలేక పోయారు. ఆ రోజు ఎన్నికలు ఎలా జరిగాయో, ఇప్పుడెలా జరుగుతున్నాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ఉన్మాదులపై ఉంది.
అప్పుడు కడపలో 11 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయితే, ఇప్పుడు మొత్తం 428 స్థానాలన్నీ ఏవిధంగా ఏకగ్రీవం అయ్యాయి..? మీరు ఏమైనా పెద్దపోటుగాళ్లా..? ఆరోజు మీకు శక్తిలేదా..? పోలీసులను అడ్డంపెట్టుకుని అధికారం అండతో బలవంతపు ఏకగ్రీవాలు చేశారే తప్ప ప్రజామోదంతో కాదు. దీనికి సీఎం జగన్ రెడ్డి జవాబివ్వాలి..
మీరంతా ప్రజాస్వామ్యాన్ని హతం చేస్తూవుంటే, మేం చూస్తూ గమ్మున ఉండాల్నా..?
ఎన్ని దౌర్జన్యాలు..? ఒకటికాదు రెండు కాదు..ప్రలోభాలకు గురిచేయడం 341, కిడ్నాప్ లు 71, బెదిరింపులు 1,185, స్క్రూటినిలో అక్రమంగా తొలగింపులు 237చోట్ల, సర్టిఫికెట్లు జారీ చేయకుండా అడ్డుకున్నవి 114, నామినేషన్ పత్రాలు లాక్కున్న సంఘటనలు 426 మొత్తం 2,374చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు.


అలాంటిది ఇప్పుడు ఎందుకు మీకు ఓటెయ్యాలి..? ప్రజలకు సమాధానం చెప్పండి. టిడిపి పాలనలో దేశంలో అన్నివిషయాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశాం. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో, నరేగా నిధులు కేంద్రం నుంచి రాబట్టడంలో, పల్లెల్లో  ఎల్ ఈడి బల్బులలో, పంటకుంటల ఏర్పాటులో, ఉపాధి పని దినాలలో, అంగన్ వాడి భవనాల నిర్మాణంలో, జీవన ప్రమాణాల పెంపులో నెంబర్ వన్ గా ఏపిని చేశాం..
2004నుంచి 2014వరకు రాష్ట్రవ్యాప్తంగా పల్లెలలో 1,111కిమీ సిమెంట్ రోడ్లు వేస్తే, టిడిపి 5ఏళ్ల(2014-19)లో 25,194కిమీ సిమెంట్ రోడ్లు నిర్మించాం, వైసిపి వచ్చాక 20నెలల్లో 296కిమీ మాత్రమే  వేసిన మీకు సిగ్గుందా ఓటడగానికి..? ఇంకా సిగ్గులేకుండా  ఏకగ్రీవం చేయాలని అడుగుతారా..? టిడిపి పాలనలో పల్లెలలో 6,15,809 పంటకుంటలు భూగర్భజలాలు పంచితే మీరువచ్చి ఏం పీకారు..? ఓటు అడగడానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నిస్తున్నానని అన్నారు.


2014కు ముందు పదేళ్లలో కేవలం 620మాత్రమే పంచాయితీ భవనాలు, అంగన్ వాడి భవనాలు నిర్మిస్తే, టిడిపి 5ఏళ్ల(2014-19)లో 7,970భవనాలు కట్టాం..గత 20నెలల్లో మీరు కట్టింది జీరో.. ''నాడు-నేడు''లో ఏం చేశారు..? చూపించుకోడానికి ఒక్క బిల్డింగ్ కూడా మీరు కట్టింది లేక తెలంగాణ వాళ్ల బిల్డింగ్ వేసుకున్నారు నిన్న యాడ్ లో.. టిడిపి హయాంలో 22.51లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.  గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్తలేకుండా ఎరువుల తయారీకి వాడితే ఈ రోజు మీరొచ్చి ఏం చేశారు. వేస్ట్ టు కంపోస్ట్ షెడ్స్ అన్నీ పాడుబెట్టారు, ట్రైసైకిళ్లను తుప్పుపట్టేలా చేశారు, గ్రామాలన్నీ చెత్తమయం చేశారు. పారిశుద్యాన్ని అధ్వానంగా మార్చారని చంద్రబాబు విమర్శించారు.
 

Related Posts