YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్షాలు ఏంటి... వాటి లెక్కేంటీ

ప్రతిపక్షాలు ఏంటి... వాటి లెక్కేంటీ

గుంటూరు, జనవరి 29, 
జగన్ అన్న మూడు అక్షరాలు ఇపుడు విపక్షాలకు తెగ కలవరం పుట్టిస్తున్నాయి. ఏమీ పాలనానుభవం లేని జగన్ ని ఒక్క ఆంధ్రా రాజకీయ నేతలు తప్ప దేశంలోని నాయకులు అంతా ఏదో ఒక సమయంలో మెచ్చుకుంటున్నారు. వారిలో పాటుగా వివిధ రంగాల ప్రముఖులు కూడా జత కావడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా విపక్షాలు ఉన్నాయి. మంత్రిగా కూడా పనిచేయని జగన్ కి ఏమి తెలుసు పాలన అని చులకన చేసిన వాళ్ళంతా ఇపుడు కిం కర్తవ్యం అని ఆలోచనలో పడుతున్నారంటే ఇరవై నెలల పాలనలో జగన్ ఎంత రాటు దేలారో చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది.జగన్ పాలనాపరంగా కొన్ని తప్పటడుగులు వేస్తే వేయవచ్చు కానీ జనం కోణం నుంచి చూస్తే మాత్రం ఆయన కరెక్ట్ లైన్ లోనే వెళ్తున్నారు. తన హామీలను తీర్చడం ద్వారా రేపటి ఎన్నికలకు కావాల్సిన సరకూ సరంజామాను జాగ్రత్తగా సమకూర్చుకుంటున్నారు. అక్కడే విపక్షానికి మంటగా ఉంది. వారు అనుకున్నది ఒకటి జరుగుతుందన్నది వేరోకటి అన్నట్లుగా సీన్ ఉంది మరి. జగన్ నానాటికి ఓట్ల పరంగా పెరిగిపోతూ దానికి అనుగుణంగా జనాలను మచ్చిక చేసుకుంటూ దూసుకుపోతూంటే తామెప్పుడు కుర్చీ ఎక్కేది అన్న చింత మాత్రం ప్రతిపక్ష జనాల్లో కలుగుతోంది అంటే ఆశ్చర్యం లేదుగా.రాష్ట్రంలో గెరిల్లా పోరాటానికి విపక్షం తెరతీసింది అని ఈ మధ్య జగన్ తరచూ మాట్లాడుతున్నారు. దాని అర్ధం డైరెక్ట్ గా ఫైట్ చేయలేక ఇలా వస్తున్నారనే. దాని మీద టీడీపీ అనుకూల మీడియా కూడా తనదైనశైలిలో వ్యాఖ్యానం చేసింది. జగన్ చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ రాజకీయంగా బలంగా కనిపిస్తున్నారు. వ్యవస్థలు అన్నీ కూడా తన గుప్పిట పట్టారు. అటువంటి జగన్ ని విపక్షం డైరెక్ట్ గా ఎలా ఎదుర్కోగలదని, ఒకవేళ ఎదుర్కొన్నా కూడా ఆ పోరు ఎలా విజయవంతం అవుతుందని కూడా కొత్త సందేహాలను చర్చకు పెట్టారు. అంటే ఎదురుగా మాట్లాడే స్వేచ్చ స్వాతంత్రం ప్రతిపక్షానికి జగన్ ఏపీలో లేకుండా చేస్తున్నాడు కాబట్టే గెరిల్లా పోరాటమే విపక్షానికి శరణ్యం అన్నట్లుగా అనుకూల మీడియా అంటోంది.రాజకీయాలు ఎప్పటికపుడు మారుతాయి కానీ మరీ ఇంతలా జడలు విప్పుకుని ఎందాకైనా అన్న తీరున సాగడం మాత్రం ఏపీ లాంటి రాష్ట్రానికి వింత అనుభవమే. ఇందుకోసం గడ్డి పోచ ఆసరా దొరికినా బలమైన తాడుగా భావించి విపక్షాలు చేస్తున్న యుధ్ధం మాత్రం ఆసక్తిగా కనిపిస్తోంది. ఇందులో జనాలను ఎంతవరకూ ప్రభావితం చేస్తారో తెలియదు కానీ జగన్ మీద డైరెక్ట్ గా యుధ్ధం చేయలేమని అంతా కలసి ఒక తీర్మానానికి వచ్చేశారా అన్న డౌట్ మాత్రం కలుగుతోంది. నోరున్న ప్రజలు కోట్లలో ఉన్నారు. వారి దైనందిన సమస్యలు కోటానుకోట్లుగా ఉన్నాయి. మరి వాటి మీద పోరాటం చేయడం మానేసి నోరు లేని దేవుడు ని పట్టుకుని అదే పెద్ద సమస్యగా చేసుకుని ఏపీలో సాగిస్తున్న రాజకీయ రచ్చకు ఫలితం దక్కుతుందా అన్నదే ఆసక్తికరం. ఒకవేళ ఏ మాత్రమైనా ఆశ కలిగించేలా ఫలితం ఉంటే మాత్రం ఏపీ రాజకీయాలు పూర్తిగా స్వభావాన్ని మార్చుకుంటాయని చెప్పకతప్పదు.

Related Posts