YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బాలుకు..భరత రత్నం దూరమా

బాలుకు..భరత రత్నం దూరమా

హైదరాబాద్, జనవరి 29, 
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఎంత దూరం అంటే ఊహకు అందనంత అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. ఈ దేశంలో పద్మ అవార్డుల ప్రదానం ‌ వివక్ష ఉందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా ఉత్తరాది వారు ఎగరేసుకుపోతారని కూడా విమర్శలు ఉన్నాయి. ఇక భారతరత్నల విషయానికి వస్తే అవి కూడా ఎక్కువగా ఉత్తరాదికే దక్కాయని జాబితా తిరగేస్తే అర్ధమవుతుంది మేధావులు చెబుతారు. ఇక రాజకీయ అవసరాలు ఉంటే ఆ రత్నాలు ఏకంగా నడచుకుంటూ ఎంత దూరమైనా వస్తాయని కూడా అంటారు.దక్షిణాదిలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. వారు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. యావత్తు దేశం వారిని అక్కున చేర్చుకుంది. వారు కూడా తన ప్రతిభాపాటవాలను సమానంగా అఖిల భారతాన కురిపించారు. అలాంటి వారిలో సంగీత దిగ్గజం మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ, సినీ సంగీత గాంధర్వం ఎస్పీ బాలసుబ్రమణ్యం ముందు వరసలో ఉంటారు. ఇక రాజకీయ రంగాన ఒక ఎన్టీయార్, మరో పీవీ నరసింహారావు లాంటి వారు కనిపిస్తారు. ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఎంతో పేరు మోసిన వారున్నారు. మరి వీరిని భారతరత్నాలు వరిస్తున్నాయా అంటే జవాబు లేదు.ఇక రాజకీయ నాయకులకు ఎంత ప్రతిభ ఉన్నా కూడా వారి పార్టీలు, వెనక ఉన్న ప్రయోజనాలు ఇవన్నీ కూడా కొంత వివాదం అవుతాయి. అందువల్ల వెనకా ముందు ఆడుతారు అనుకున్నా ఏ వివాదం లేని మంగళంపల్లి, బాలూ లాంటి వారి విషయంలో ఎందుకీ తటపటాయింపు అన్న చర్చ అయితే కచ్చితంగా వస్తోంది. బాలూ భారతీయ గాయకుడు. పైగా ఆయన ఏ భాషలో పాడితే ఆ భాషవారు ఉచ్చారణను పట్టి అలాగే భాష, భావం చెడకుండా పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్న వారు. మరి బాలూకి భారతరత్న ఇవ్వడానికి అనేక ఇతర అర్హతలు కూడా ఉన్నాయి. ఆయనలా బహుముఖీయమైన ప్రతిభను సినిమా సంగీతంలో ఇప్పటిదాకా ఎవరూ కనబరచలేదు. ఆయన నలభై వేలకు తగ్గకుండా పాడారు. దాదాపు అన్ని భాషల‌లో పాడి అశేషమైన శ్రోతలను రంజింపచేశారు. అలా చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. మరి అలాంటి బాలూ వివాదస్పదుడు అంతకంటే కాదు. ఆయనను గౌరవించుకోవాలని దేశం మొత్తం తపించింది. కానీ ఆయనకు ఆ అవార్డు అడుగు దూరంలోనే ఉండిపోయింది.
ఏపీ సర్కార్ తరఫున వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసి బాలూకు భారతరత్న సిఫార్సు చేశారు. ఇక తమిళనాడు, కన్నడసీమ సహా అంతా అదే కోరుకున్నాయి. ఇన్ని చేస్తే ఆయనకు ఇచ్చినది పద్మవిభూషణ్. ఇది గొప్ప అవార్డే. అది కూడా బతికుండగానే ఇవ్వాల్సిన అవార్డు. ఈ పద్మ విభూషణ్ కూడా ఎందరికో ముందే ఇచ్చేశారు. మరి బాలూకి మాత్రం మరణానంతరం ఇచ్చారు. భారతరత్నకు ఆయన ఏ విధంగా అర్హుడు కాడో చెప్పాలన్నది అభిమానుల ఆవేదనాభరితమైన ప్రశ్న. బాలూ లాంటి వారికే ఇలా జరిగితే ఇక ఈ అవార్డు గురించి భవిష్యత్తు తరాలు మరచిపోవచ్చు అని కూడా మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా అవార్డులకు కూడా గొప్పతనం కావాలి. అవి ప్రతిభావంతుల సరసన చేరితేనే వికసించేది. పరిమళించేది. ఇక బాలూ విషయానికి వస్తే భారతీయ జనం గుండెల్లో ఎప్పటికీ భారతరత్నమే.

Related Posts