YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మనుషులు- మహాత్ములు

మనుషులు- మహాత్ములు

మహా ఆత్మ అని మనుషుల్లోని గొప్పవారిని ప్రశంసించడం ఒక సంస్కారం. నిజానికి ఆత్మకు పుట్టుక, మరణం లేవు. అది సాక్షి మాత్రమే అని భగవద్గీత బోధిస్తుంది. పవిత్రాత్మలు, మహోన్నత ఆత్మ స్వరూపం అని కొలిచే రూపం- కనిపించే శరీరమే . శరీరంతోనే ఎటువంటి సత్కార్యమైనా, దుష్కార్యమైనా సంభవం. మనిషిలోని సంస్కారాన్ని అనుసరించి గొప్పతనాన్ని ఆత్మకు ఆపాదించడం సంస్కృతిలో భాగం. శరీర తత్వం అనేక ప్రకృతితత్వాల కూర్ఫు అది పంచభూతాత్మకం. ఇంద్రియాలతో అనుభవించే అనుభూతి మానవ శరీరాన్ని పులకింపజేస్తుంది. మనిషిని నడిపించే అంతరంగ శక్తి మనసు. అది ఆలోచనల సమూహం. ఆలోచనలను తగ్గించుకుని, సత్సంకల్పమైన పరిమిత లక్ష్యాలతో జీవిత ప్రయాణం సాగిస్తే పరిపూర్ణ సార్థకత సాధ్యమే. మనసు, మాట, చేత మూడింటినీ త్రికరణాలుగా చెబుతారు.
మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మానాం అని ఉపనిషత్తు వాక్యం.
మనసు, వచనం, క్రియ ఏకత్వంగా సాగితే మనుషులు మహాత్ములు అవుతారు. భిన్నంగా జరిగితే దురాత్ములుగా మిగులుతారు. మనసులోని ఆలోచనే మాట్లాడాలి. మాట్లాడిన విధంగానే ఆచరణ జరగాలి. మనిషి తన జీవితాన్ని సరైన విధంగా త్రిగుణాల సంయమనంతోనే మలచుకోగలుగుతాడు. శ్రీరాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వనవాస నిర్ణయాన్ని బలంగా మనసులో నిశ్చయించుకున్నాడు. తండ్రితో, పరివారంతో, ప్రజలతో తన మనసులోని ఆలోచననే గట్టిగా చెప్పాడు. అకుంఠితమైన దీక్షతో, పట్టుదలతో కార్యాచరణ కొనసాగింది. మాట, క్రియ, ఆలోచనల సమన్వయ విధానం శ్రీరాముణ్ని మహాత్ముడిగా నిలబెట్టింది. కొందరి మనసులో ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాటిని పదిమందితో పంచుకునే మాటలు మరోలా ఉంటాయి. ఆచరణలో జరిగే తంతు వాటికి విరుద్ధంగా ఉంటుంది. దానికే లౌక్యం, రాజకీయ చతురత అనే అందమైన పేర్లు తగిలిస్తారు. ఎవరిని వారే మోసం చేసుకొనే సంస్కారం మనిషిని పతనానికి చేరుస్తుంది. సమాజం వ్యక్తుల సమూహం. సామూహిక ధర్మాలు, వ్యక్తిగత ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. మహర్షులు వేదపూర్వకంగా, ఉపనిషత్‌ ఉపదేశంగా, పౌరాణిక కథలుగా వాటిని నిర్వచించారు. వాటిని ఆకళింపు చేసుకొని, విచక్షణతో, వివేకంతో మార్గాన్ని నిర్దేశించుకున్నప్పుడు మనలోనుంచే మహాత్ములు ఆవిర్భవిస్తారు. భక్తితత్వంతో మనిషి మనీషిగా, మహోన్నతుడిగా ఎలా ఎదగాలో భాగవతం వివరిస్తుంది. ధర్మంతో, సహనంతో కార్యాన్ని కొనసాగిస్తే, కష్టాల్లోనూ ధర్మాన్ని పాటిస్తే విజయం తథ్యమని భారతం ప్రకటించింది. సామాజిక న్యాయంతో సధర్మాన్ని పాటిస్తూ, మానవతా విలువలను ఆచరిస్తే మహాత్ముడిగా మారగలమనే సందేశాన్ని రామాయణం అందించింది. మనుషులంతా ఒకే విధంగా జన్మించినా ఆచరణ విధానంలో కొందరు మహాత్ములుగా మహనీయులుగా వెలుగొందుతారు. వారి మాట, బాట అందరికీ అనుసరణీయాలు. 

Related Posts