భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించడంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటీసు సరిగా ఉందో లేదో చూడడమే నాయుడు పని అని, నోటీసును తిరస్కరించే అధికారం ఆయనకు లేదని అన్నారు. 64 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చిన అభిశంసన నోటీసులో సంతకం చేసిన ఎంపీలకు కచ్చితత్వం లేదంటూ వెంకయ్యనాయుడు సోమవారంనాడు ఆ నోటీసును తిరస్కరించారు. రాజ్యంగ న్యాయనిపుణులతో చర్చించే నిర్ణయం తీసుకున్నట్టు కూడా పేర్కొన్నారు. దీనిపై ప్రశాంత్ భూషణ్ ఓ ట్వీట్‌లో స్పందించారు. 'నోటీసులో 50 మంది కంటే ఎక్కువ మంది ఎంపీలు సంతకాలు చేశారా లేదా అనేది చూడాలి. ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు? ఆ అధికారం ఆయనకు ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులో కోరారు. అంతేకానీ అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించడం సరైన నిర్ణయం కాదు' అని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.
కాగా, ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి చర్చపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా తెలిపారు. 'నిజంగా ఇది చాలా కీలక అంశం. ఏ కారణంతో నోటీసు తిరస్కరించారో తెలియదు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు న్యాయనిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాయి' అని ఆయన చెప్పారు.