విజయవాడ, జనవరి 30,
రాజకీయాలను వదలకపోయినప్పటికీ సినిమాలు కంటిన్యూ చేయమని పవన్ కల్యాణ్ కు చిరంజీవి సలహా. హఠాత్తుగా ఈ విషయం బయటికి రాలేదు. ఎప్పట్నుంచో అనుకుంటున్నదే. అయితే రాజకీయరంగంలో పవన్ కు చిరంజీవి సహకరిస్తానంటూ భరోసా ఇచ్చారనేది కొత్త వార్త. ఏ రూపంలో సహకరిస్తారు? దానివల్ల ప్రయోజనం ఎంతవరకూ ఉంటుంది. ప్రజారాజ్యంతో వైఫల్యాన్ని చవిచూసిన మెగాస్టార్ వల్ల జనసేనకు సమకూరే మేలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నిజంగానే పవన్ కు చిరంజీవి సహకరించే అవకాశాలున్నాయా? అనే సంశయమూ తలెత్తుతుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడుస్తున్నారు. గతంలో చిరంజీవి కాంగ్రెసుతో కలిసి కేంద్రంలో మంత్రి పదవిని నిర్వహించారు. సొంతంగా పార్టీతో ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా ప్రభావితం చేయడం సాధ్యం కాదనే భావనకు మెగా సోదరులు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖాముఖి శక్తులుగా వైసీపీ, టీడీపీలు మరో ఎన్నిక వరకూ తలపడే వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు రాజకీయాలు తారుమారు కావు. అందువల్ల పవన్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను, సామాజిక వర్గ పరంగా ఇన్ ఫ్లూయన్స్ ను కాపాడుకోవాలంటే తనకు గట్టి పట్టున్న సినిమా రంగాన్ని విడిచిపెట్టకూడదనేది చిరంజీవి సలహాలోని ఆంతర్యం.ఆంద్రప్రదేశ్ లో ఉన్న కులపరమైన సమీకరణ పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కనిపించదు. రాజకీయంగా ప్రధాన పార్టీలు రెంటికీ కులాల మధ్య చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడో వర్గంగా పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన ఇప్పుడిప్పుడే పాదుకుంటోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కొంతమేరకు సంఘటితమైన కాపు సామాజిక వర్గం ఆ తర్వాత రాజకీయంగా మళ్లీ చీలిపోయింది. కాపు సామాజిక వర్గం పూర్తిగా సంఘటితమై ఇతర వర్గాల నుంచి 15 నుంచి 20 శాతం ఓట్లను తెచ్చుకోగలిగితే అధికారానికి బాటలు పడినట్లే. ఆ మేరకు నూతన సమీకరణ జరిగే వాతావరణం ఆంధప్రదేశ్ లో ఏర్పడటం లేదు. టీడీపీ, వైసీపీలు సామాజిక వర్గాల వెన్నుదన్నుగా నిలిచినప్పటికీ ఇతర కులాలు కూడా ఆ రెంటి వైపు ఆకర్షితమవుతున్నాయి. అందుకు భిన్నమైన నేపథ్యాలు తోడవుతున్నాయి. కానీ ప్రజారాజ్యం, జనసేనలు ఇతర సామాజిక వర్గాల ఓట్లను పెద్ద ఎత్తున రాబట్టడంలో వైఫల్యం చెందాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు సొంత కాళ్లపై నిలదొక్కుకోవడమే కష్టం. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కులపరమైన పార్టీలు చాలా ఉన్నాయి. కానీ అవి ఏదో ఒక ప్రధానపార్టీకి మద్దతు పలుకుతూ అధికారంలో భాగస్వామ్యం వహిస్తూ ఉంటాయి. తద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాయి.పార్టీని నడపడం అంత సులభం కాదనే గ్రహింపుతోనే గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేశారు. అప్పటికి రాష్ట్ర పునర్విభజన జరుగుతుందనే అంచనా లేదు. దాంతో కేవలం సహాయ మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నవ్యాంధ్రలో సామాజిక వర్గ పరంగా అత్యధిక ఓటింగు ఉన్నప్పటికీ బంగారం వంటి అవకాశం కోల్పోయారు. కాంగ్రెసుకు బయటి నుంచి మద్దతు ప్రకటించి పార్టీని కాపాడుకుని ఉంటే ప్రజారాజ్యం ఇప్పటికే ఆంధ్రలో అధికారానికి చేరువ అయి ఉండేది. అదే తరహాలో తప్పిదాన్ని పవన్ కల్యాణ‌్ కూడా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా సీట్లు తీసుకుని ఉంటే జనసేన బలమైన పార్టీగా ఉండేది. స్వచ్ఛంద సహకారం ఇవ్వడంతో టీడీపీ వాడుకుని వదిలేసింది. 2019 నాటికి కన్ఫ్యూజన్ లో పడి నానాటికీ క్షీణిస్తున్న కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు పవన్. తీవ్రమైన పరాభవాన్నే చవిచూశారు. 2014, 19 లలో అవకాశం కోల్పోవడంతో భవిష్యత్ జనసేన ప్రస్తానంపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. అయితే ప్రజారాజ్యం తరహాలో పార్టీని మూసేయకుండా బీజేపీ తో కలిసి మనుగడ కాపాడుకోవాలనేది పవన్ యోచన. ఇది ఎంతవరకూ ఫలిస్తుందంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.కాంగ్రెసు పార్టీతో చేతులు కలపడం వల్ల చిరంజీవికి సమకూరిన ప్రయోజనం పెద్దగా లేదు. రాజ్య సభ సీటు, సహాయమంత్రి పదవి మాత్రమే దక్కాయి. నటుడిగా ఆయనకున్న పలుకుబడితో పోలిస్తే రాజకీయంగా ఆయన పొందింది దాదాపు శూన్యం. పదేళ్ల అధికారం తర్వాత కాంగ్రెసు దేశంలోనే బలహీనపడి పోయింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ హవా నడుస్తోంది. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలతో క్రమేపీ ఓటింగ్ కోల్పోతుందేమోననే ఆందోళన బీజేపీ శ్రేణుల్లో ఉంది. 2024 నాటికి పరిస్థితి ఏమిటన్నది ఎవరూ చెప్పలేరు. మతపరమైన అజెండా నేపథ్యంలోనే దేశంలో తన ప్రభావాన్నిబీజేపీ నిలబెట్టుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ అంశం పెద్దగా వర్కవుట్ కాదు. బీజేపీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందన్న వాదనను టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. టీడీపీ, వైసీపీల్లో ఒక పార్టీ తీవ్రంగా బలహీనపడినప్పుడే జనసేన, బీజేపీ కాంబినేషన్ కు అవకాశాలు మెరుగవుతాయి. అంతవరకూ సుదీర్ఘ పోరాటానికి జనసేన సిద్ధం కావాలి. ఇందుకు అనుగుణంగా తమ్ముడు తయారు కావాలనే యోచనతోనే సినిమాలు, రాజకీయాలు రెంటినీ నడపవలసిందిగా చిరంజీవి సలహా ఇచ్చారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. పవన్ కు ఉండే ప్రేక్షకాభిమానులే జనసేనకు ప్రధాన బలం. సినిమాలను వదిలేసి, కేవలం రాజకీయాలకే పరిమితమై, అధికారం కూడా దక్కకపోతే క్రమేపీ ఆకర్షణ తగ్గుముఖం పడుతుంది. చిరంజీవికి ఎదురైన పరిస్థితి ఇదే. పవన్ విషయంలో అది పునరావృతం కాకూడదనేది మెగాస్టార్ సలహా సారాంశం.