జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా మున్సిపల్ మేనేజర్ బేబీ, మున్సిపల్ అధికారులు, స్థానిక మున్సిపల్ కార్యాలయం అవరణలో శనివారం గాంధీ వర్థంతి సందర్భంగా మహాత్మాగాంధీకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్ముని వర్థంతి రోజున ఆయనను గుర్తుచేసుకోవడం, ఆయన ఆలోచనలను పంచుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, తమ ప్రాణాలను అర్పించిన అమర వీరులను గుర్తు చేసుకోవడం అవసరమన్నారు. మహాత్ముడి రాజనీతిజ్ఞత, దూరదృష్టి కారణంగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సామాజికవర్గాలకు చెందినవారిలో స్వాతంత్ర్యస్ఫూర్తి చైతన్యం రేకెత్తాయన్నారు. దేశం నలుమూలలా ఉద్యమాలు ఉధృతమై బ్రిటిషర్లకు ఊపిరి సలపకుండా చేశాయ న్నారు. ఆయన నాయకత్వంలో లక్షల మంది దేశభక్తులు ఎన్నో కష్టనష్టాల కోర్చి, వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను త్యాగం చేసిన ఫలితంగానే ఈ స్వాతంత్ర్యం మనకు అందిందనే విషయాన్ని మనమంతా, మరీ ముఖ్యంగా నేటి యువత గుర్తుంచుకోవాలని అన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం చిరునవ్వుతో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన భరతమాత వీరపుత్రుల శౌర్య, త్యాగాలను స్మరించుకోవడం మనకు ప్రేరణ కావాల న్నారు. బానిసత్వం, అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించి, బ్రిటిష్ సామ్రాజ్యశక్తుల్ని తిరుగులేని సంకల్పశక్తితో ఎదిరించి నిలిచిన ఈ మహనీయుల ఉన్నతాదర్శాలను మనం అనుసరించాలని సూచించారు. ‘విప్లవ ఖడ్గం, ఆలోచనా శిలలపై పదునెక్కుతుంది’ అన్న భగత్‌సింగ్ మాటలు ఈ మహనీయుల జీవితాలకు చక్కగా సరిపోతాయన్నారు.బ్రిటిష్ పాలన నుంచి బయటపడి భారతదేశంలో స్వపరిపాలన, సుపరిపాలన అందించాలన్న ఏకైక లక్ష్యంతో పోరాటం చేసిన సమరయోధులను, వారి త్యాగాలను ఈ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మరించుకోవడమే కాదు, నేటి పరిస్థితుల నేపథ్యంలో వారి స్ఫూర్తిని ఏ విధంగా స్వీకరించాలన్న విషయంపై మనం దృష్టి సారించాల న్నారు. అలాంటి దేశభక్తుల అడుగుజాడల్లో నడుస్తూ, రెట్టించిన శక్తిసామర్థ్యాలతో భారతదేశ అభివృద్ధి గమనంలో కీలక భూమిక పోషించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి బోధనల్లోని ‘మీరు చూడాలనుకున్న ప్రపంచంలోని మార్పుకు మీరే నాంది కావాలి’ అనే మాటల నుంచి ప్రేరణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణ మూర్తి, మున్సిపల్ అర్ ఐ రంగన్న, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు