YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మదనపల్లిలో ఐదు కోట్ల ప్రాపర్టీ

మదనపల్లిలో ఐదు కోట్ల ప్రాపర్టీ

తిరుపతి, ఫిబ్రవరి 1, 
అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ పిల్లలను బలి ఇవ్వడం ఏంటి? తల్లిదండ్రుల్లో మూఢభక్తి నింపిన వారిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?పురుషోత్తం కుటుంబానికి చెందిన 5 కోట్ల రూపాయల ప్రాపర్టీ వివాదం ఉన్నట్టు స్థానికులు, పురుషోత్తంనాయుడు కొలీగ్స్‌ చెబుతున్నారు. ఈ వివాదం కారణంగా ఎవరైనా ఈ కుటుంబానికి అలవాటైన అతి ఆథ్యాత్మిక చింతనను ఆసరాగా చేసుకుని మాస్‌ హిప్నాటిజం చేశారా ? లేదా మెదడుపై విపరీతమైన ప్రభావం చూపి, చిత్తభ్రమలకు గురి చేసే ఏదైనా మత్తు పదార్థాలు ఇచ్చారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పద్మజ, పురుషోత్తమ్‌నాయుడులు కొత్తగా సకలహంగులతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇందులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫుటేజీని పరిశీలిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. పోలీసుల రిమాండ్‌ రిపోర్టు ప్రకారం కుక్కను వాకింగ్ కి తీసుకెళ్లినప్పుడు రోడ్డుపై ఉన్న నిమ్మకాయ, పసుపు, కుంకుమలు తొక్కినప్పటి నుంచి ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఆ రోజు నుంచి ఘటన జరిగిన రోజు వరకు ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారు ? ఎంత సేపు ఉన్నారు అనేది సీసీ కెమెరాల్లో రికార్డయి ఉంటుంది. అది పోలీసుల చేతికి చిక్కినప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుస్తుంది. అతీంద్రియ శక్తులను ఉన్నట్లుగా ఊహించుకోవడమే హత్యలకు కారణమైందా..? అనేదే ఇప్పుడు అందరి ముందు మెదులుతున్న ప్రశ్న. మొత్తంగా తాంత్రిక విద్యపై అలేఖ్య పిచ్చినమ్మకం తీర్చలేని నష్టానికి కారణమైందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. దైవమన్నది ఒక మధురమయిన ఊహ. మానవులు కనిపెట్టిన అన్నిటిలోకీ అద్భుతమయిన భావన. ఏ ప్రశ్నకూ దైవం సమాధానం కాకపోవచ్చును కానీ, ప్రశ్నలను ఉపశమింపజేసే శక్తి మాత్రం దైవానికి ఉంది. అయితే.. అది మూఢత్వంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు
పిచ్చి..పీక్స్ కు వెళ్లినట్టుందే
చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార్తె అలేఖ్య వల్లే ఈ దారుణం జరిగిందన్న భావన కలుగుతోంది. భోపాల్‌లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైన అలేఖ్య తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఆ మూఢనమ్మకాల వైపు నడిపించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది.MBA చదివిన అలేఖ్య… సామాన్యురాలేమీ కాదు. 27 ఏళ్ల వయస్సున్న ఆమె… మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో కొంతకాలం పనిచేసింది. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. ఆమెకున్న చదువు శ్రద్ధతో ఆమె ఖచ్చితంగా సివిల్స్ సాధిస్తుందనేది అక్కడి స్థానికుల మాట. అయితే గత కొంతకాలంగా ఇంట్లోనే ఉండటంతో ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతుండటంతో పాటు భక్తి గురించి ఇంట్లో వారికి ఎక్కువగా చెప్తుండేది. దీనికి తోడు పురుషోత్తం కుటుంబానికి మొదటి నుంచి ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి.అలేఖ్య చెప్పే మాటలను తేలిగ్గా నమ్మేశారు ఆమె తల్లిదండ్రులు. అలా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు అధికంగా చదువుతూ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. పునర్జన్మ, కలియుగం అంతం, సత్యలోకం వంటివాటిపై అపరిమితమైన విశ్వాసం పెంచుకున్నారు. దేవుడు అన్న భావన మీద మితిమీరిన నమ్మకం, దెయ్యాలంటే అలవిమాలిన భయం పురుషోత్తమ్ నాయుడు కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి.మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పీజీలు చేసిన తల్లిదండ్రులు పునర్జన్మ నమ్మకంతో నాలుక కోయడం వారి తీరుకు పరాకాష్ట. కథంతా అలేఖ్య చుట్టూనే నడుస్తోంది. స్క్రీన్‌ప్లే అంతా ఆమెదే… తన కుటుంబం మొత్తాన్ని హిప్నటైజే చేసేసింది. తన ట్రాన్స్‌లో పడేలా చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పిచ్చి తల్లి ఆమెకు సహకరించింది.
తండ్రిని నువ్వు గత జన్మలో అర్జునుడివి అంటూ నమ్మించింది. తల్లిని నువ్వే కాళిక అని చెప్పింది. అసలే మూడభక్తి ట్రాన్స్‌లో ఉన్న తల్లిదండ్రులు మరో లోకంలోకి వెళ్లిపోయారు. దాని ఫలితమే రెండు నిండు జీవితాలు బలి. బంగారు భవిష్యత్‌ ఉన్న పిల్లలిద్దరూ మూడభక్తిలో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మానసిక స్థితి సరిలేని తల్లిదండ్రులు పిచ్చాసుపత్రి పాలయ్యారు

Related Posts