YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

‘కృష్ణ’ శబ్దం మనోహరం

‘కృష్ణ’ శబ్దం మనోహరం

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.
భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతశ్శత్రువులను హరించే శక్తి కలది.
సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.
కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు.
మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.
గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు... ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.
రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు.
ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు.
కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ్భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.
వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.
అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ.మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.
ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.
జై శ్రీ కృష్ణ 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts