YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రత్యక్ష దైవం

ప్రత్యక్ష దైవం

భారతీయ ఖగోళ శాస్త్రం నవగ్రహాలలో సూర్య గ్రహం ప్రధానమైనదిగా పేర్కొంది. ప్రపంచ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు దాన్ని సమర్థించారు. అయితే జనుల దృష్టిలో ఆయన సాక్షాత్తూ భగవంతుడే! 
సూర్యుడు 'త్రిమూర్తుల స్వరూపం' అని మహాఋషులు భావన చేశారు. 
సృష్ట్యాదికి పూర్వమే ప్రత్యక్ష దైవంగా లోకానికి వెలుగును ఇచ్చిన నారాయణుడిగా ఆయనను ఆరాధించారు. సూర్యారాధన యుగయుగాల నుంచీ వస్తోంది.
వేదాలు ప్రముఖంగా ప్రస్తావించిన ఆదిదేవుడు సూర్య నారాయణుడు. ఇతిహాసాలూ, పురాణాలూ ఆ దివాకరుణ్ణి అనేక విధాల ప్రశంసించాయి.
ప్రాణికోటికి ఆలంబన
సూర్యుడిపై ప్రత్యేకంగా రచించిన ఉపనిషత్తు
‘అక్ష్యుపనిషత్తు'. ‘సూర్య ఆత్మా జగత్‌ సస్తుషస్యః' అన్నది ఋగ్వేదం. ‘జగత్తులో ప్రాణులు అన్నిటికీ సూర్యుడే ఆత్మ' అని భావం.
‘ప్రాణోవై అర్కః' - ప్రాణమే సూర్యుడు. ‘స ఏష వైశ్వానరో, విశ్వరూపః, ప్రాణో అగ్ని రుద్రయతే' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది.
‘‘సూర్యోదయంతోనే జగత్తులో ప్రాణాగ్ని సంచారం చేస్తుంది. సూర్యుడి వల్లనే సమస్త ప్రాణికోటికీ ప్రాణం లభిస్తుంది'' అని ‘శతపథ బ్రాహ్మణం' వివరించింది.
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌' అని శాస్త్రవచనం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. శరీరానికి సూర్యకిరణాలు తాకడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనీ, కొన్ని రకాల రుగ్మతలు నివృత్తి అవుతాయనీ ప్రకృతి వైద్య శాస్త్రం చెబుతోంది.
సూర్యుడు' అనే పదానికి ‘సువతి ప్రేరయితి జనాన్‌ కర్మణేతి సూర్యః' అని వ్యుత్పత్తి.
‘లోకులు వారి కర్తవ్యాలను నిర్వహించుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడు' అని అర్థం.
ఈ విధంగా జగత్తును తన వెలుగుతో నడిపిస్తున్నవాడు సూర్య భగవానుడు.
మహాభారతంలో ‘రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి, యర్కుండు వెలిగించునట్టు' అంటూ భీష్ముని నోట పలికిన భావం ఇదే!
జగత్తుకు- జగదీశ్వరుడైన సూర్యుడికీ అంతటి అవినాభావ సంబంధం. ఆయనను ‘కర్మసాక్షి' అని పూర్వులు సంబోధించారు.
‘ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు'నన్నాడు మహాకవి పోతన. అందుకే సూర్యుడు అందరివాడు.
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు అవి: గాయత్రి, బృహతి, ఉష్ణిక్‌, జగతి, త్రిష్ఠుప్‌, అనుష్ఠుప్‌, పంక్తి. అలాగే ఆ గుర్రాలను ఏడు వారాలుగా, ఇంద్రధనుస్సులోని ఏడు రంగులుగా, సప్త ఛందస్సులుగా కూడా పరిగణిస్తారు.
సూర్యుడి రథానికి ఉన్న ఆకులు పన్నెండు. వాటిని నెలలుగా, రాశులుగా భావిస్తారు. రథానికి ఉన్న రెండు ఇరుసులు రాత్రి, పగలు. సూర్యుడి రథ సారథి పేరు అనూరుడు. అతను గరుత్మంతుడి సోదరుడు. ఊరువులు (తొడలు) లేకుండా జన్మించాడు కాబట్టి అతణ్ణి ‘అనూరుడు' అంటారు.సూర్యుని తండ్రి కశ్యపుడు. తల్లి అదితి. అందుకే ఆయనను ‘ఆదిత్యుడు' అంటారు.
ప్రతిరోజూ సూర్యాష్టకం చదివితే గ్రహబాధలు తొలగడంతో పాటు ఆరోగ్యం కూడా ఒనగూరుతుంది.
ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేస్తే ఆరోగ్యంతో పాటు సర్వత్రా విజయం చేకూరుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.
జై శ్రీమన్నారాయణ

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts