@ ఆరోగ్యానికి పెద్దపీట.
@ ఐపీవోకు ఎల్ఐసీ..
@ రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
@ మరో కోటి మందికి ఉజ్వల పథకం
@ డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు..
@ వయో వృద్ధులకు ఐటీ రిటర్న్స్ నుంచి మినహాయింపు
@ లబ్ధిదారుల కోసమే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు
@ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు
@ తగ్గనున్న బంగారం, వెండి ధరలు!
@ ఐటీ శ్లాబ్స్‌లో నో చేంజ్
@ రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు.. @ ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ
డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను సమర్పించిన నిర్మలా సీతారామన్
హైదరాబాద్ ఫిబ్రవరి 1 (న్యూస్ పల్స్)కేంద్ర బడ్జెట్ 2021-22ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను సమర్పించారు. అనంతరం ట్యాబ్ లో చూసి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో మొదటిది ఆరోగ్యం, సంరక్షణ. రెండోది ఫిజికల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రా. మూడోది సమ్మిళిత వృద్ధి, నాలుగోది హ్యూమన్ క్యాపిటల్. ఐదోది ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (ఆర్ & డీ), ఆరోది కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన. ఈ ఆరు మూల స్తంభాలపైనే బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మల తెలిపారు.
కరోనాతో దేశం ఎప్పుడూ లేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొందని.. లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. అత్యవసర సేవల రంగంలో పనిచేసిన వారందరూ తమ ప్రాణలొడ్డి పనిచేశారని నిర్మల తెలిపారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో వ్యాధిని నివారణ కేంద్రంతోపాటు 15 ఎమర్జెన్సీ వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.ఆరోగ్యరంగంలో రూ.64180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మల తెలిపారు. దీనికి పీఎం ఆత్మనిర్భర్ భారత్ ఆరోగ్య పథకంలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. కొత్తగా బీఎస్ఎల్-3 స్తాయి ప్రయోగశాలలు 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు.. భారత్ తోపాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఐపీవోకు ఎల్ఐసీ..
భారతీయ జీవిత బీమా సంస్థ.. త్వరలో ఐపీవోకు వెళ్లనున్నది. అయితే దీని కోసం కావాల్సిన సవరణను త్వరలో పార్లమెంట్‌లో తీసుకురానున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా.. పలు బ్యాంకులను, బీమా సంస్థలను బలోపేతం చేయనున్నట్లు ఆమె తెలిపారు. జీవిత బీమా సంస్థ షేర్లను పబ్లిక్‌గా అమ్మనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే దీని కోసం కావాల్సిన చట్ట సవరణను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సుమారు 1.75 లక్ష కోట్లు ఈ వార్షిక ఏడాదిలో రాబట్టనున్నట్లు ఆమె తెలిపారు.
రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆమె తన 2020-21 బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా కనీస మద్ధతు ధర ఉండేలా చూస్తామని నిర్మల వ్యవసాయ రంగానికి హామీ ఇచ్చారు.అదేవిధంగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ధాన్యం సేకరణ గురించి ప్రస్తావించారు. దేశంలో ధాన్యం సేకరణ కూడా ఒక స్థిరమైన వేగంతో పెరుగుతన్నదని, దాంతో రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయని నిర్మలా చెప్పారు. గోధుమల సేకరణకు సంబంధించి 2013-14లో ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం రూ.33,874 కోట్లు మాత్రమేనని, 2019-20 లో అది రూ.62,802 కోట్లకు, 2020-21లో రూ.75,060 కోట్లకు పెరిగిందని ఆమె తెలిపారు. అంతేగాక కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన ఉత్పత్తుల సంబంధించి 2013-14తో పోలిస్తే 2020-21లో పత్తి రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరిగాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2013-14లో పత్తి సేకరణకు సంబంధించి పత్తి రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ.90 కోట్లు కాగా, 2020-21లో అది రూ.25,000 కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ చెల్లింపుల ద్వారా మొత్తం 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని ఆమె వెల్లడించారు.
మరో కోటి మందికి ఉజ్వల పథకం
వంలట గ్యాస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. నగరాల్లో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఉజ్వల పథకాన్ని దేశంలో మరో కోటి మంది లబ్ధిదారులకు విస్తరించనున్నట్లు తెలిపారు. కొత్తగా మరో 100 జిల్లాల్లోని నగరాలకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించబోతున్నామని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు..
దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు చేపట్టనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే తొలిసారి డిజిటల్ పద్ధతిలో జనాభా గణన ఉంటుందని మంత్రి తెలిపారు. డిజిటల్ జనాభా లెక్కింపు ప్రక్రియ కోసం సుమారు 3700 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సముద్రాల అధ్యయనం కోసం డీప్ ఓషియన్ మిషన్‌ను స్టార్ట్ చేయనున్నామన్నారు. 4 వేల కోట్లతో సముద్రాల సర్వే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు 35 వేల కోట్లు కేటాయించారు. 2025-26 సంవత్సరం వరకు ఈ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మరో 100 సైనిక్ స్కూళ్లను దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయనున్నారు.
వయో వృద్ధులకు ఐటీ రిటర్న్స్ నుంచి మినహాయింపు
వయో వృద్థులకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పెన్షన్, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు వర్తిస్తుంది.ఇక చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో గృహనిర్మాణానికి పన్ను విరామాన్ని ప్రకటించారు.
లబ్ధిదారుల కోసమే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు
లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతున్నదని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ అందుబాటులో ఉన్నదని ఆమె వెల్లడించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ప్రైవేటీకరించనున్నట్లు తేల్చి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆమె బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయా సంస్థలు బహిరంగ మార్కెట్లో ప్రకటించిన ఐపీవోల ద్వారా వాటి వాటాలను ఎల్ఐసీ కొనుగోలు చేసేది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక కామధేనువుగా, కల్పతరువుగా నిలిచింది.
తగ్గనున్న బంగారం, వెండి ధరలు!
బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్‌పై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ల ధరలు, కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు, ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం కానున్నాయి.
ఐటీ శ్లాబ్స్‌లో నో చేంజ్
బడ్జెట్ అంటే సగటు వేతన జీవి ఆసక్తిగా చూసేది ఆదాయ పన్ను గురించిన అంశాలే. కానీ ఈ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరగన బడ్జెట్, కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో మధ్య తరగతి ఊరట కలిగించే ఎన్నో వరాలు ప్రకటిస్తారని ఆశించినా అదేమీ జరగలేదు. ఆదాయ పన్నుశ్లాబుల్లో ఎలాంటి మార్పులూ లేవు. కేవలం 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు మాత్రం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని మాత్రం నిర్మల ప్రకటించారు.
రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు.. ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ది చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల నిధులు అందించనున్నారు. దేశీయ విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.