తిరుపతి, ఫిబ్రవరి 2,
ముఖ్యమంత్రి అన్నాక అన్ని వర్గాలను కలుపుకుని పోవాలి. అందరి వాడు అనిపించుకోవాలి. కానీ జగన్ మాత్రం ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కమ్మ సామాజకవర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవం. స్వతహాగా వ్యాపార, కాంట్రాక్టర్లుగా ఉన్న వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శ సర్వత్రా వినిపిస్తుంది.రాజధాని అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు వరకూ ఆ సామాజికవర్గాన్ని తొక్కేందుకు జగన్ ప్రయత్నించారంటున్నారు. నిజంగానే కమ్మ సామాజికవర్గంలో అత్యధికులు గత ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచారు. ఆర్థికంగా సాయమందించినా బాబు గెలవలేదు. అయితే అదే సమయంలో జగన్ ను సపోర్టు చేసిన కమ్మ సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సినీ నటుడు మోహన్ బాబు ఒకరు.మోహన్ బాబు వ్యాఖ్యలకు ఒక వాల్యూ ఉంటుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబును మోహన్ బాబు ఒక ఆట ఆడుకున్నారు. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. మోహన్ బాబు వల్ల ఎంత పార్టీకి ప్రయోజనం జరిగిందన్నది పక్కన పెడితే, ఆయన రాకతో వైసీపీ బలం పెరిగిందని మాత్రం చెప్పవచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబును జగన్ పట్టించుకోవడం మానేశారు. మోహన్ బాబుకు ఎన్టీఆర్ సమయం నుంచి రాజకీయాలంటే ఇష్టం. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మరోసారి పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. తనపై ఉన్న యాంటీ కమ్మ ముద్రను తొలగించుకోవాలంటే జగన్ మోహన్ బాబుకు పదవి ఇవ్వాలన్న కామెంట్స్ కూడా పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. జగన్ మంత్రివర్గంలో కొడాలి నాని ఒక్కరికే అవకాశమిచ్చారు. ఇప్పటి వరకూ భర్తీ అయిన పదవులను కమ్మ సామాజికవర్గానికి ఇవ్వలేదన్న ప్రశ్నకు కూడా జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మోహన్ బాబుకు పదవి ఇచ్చి అందరివాడు అనిపించుకోవాలన్నది వైసీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గం నేతల భావన. మరి జగన్ పట్టించుకుంటారా? లేదా? అన్నది చూడాలి.