YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జక్కంపూడికి ఝలక్..

జక్కంపూడికి ఝలక్..

కాకినాడ, ఫిబ్రవరి 2, 
రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి దగ్గర పెద్ద పంచాయితీనే గత కొంతకాలంగా సాగుతుందని తెలిసింది. ఎంపి భరత్ రామ్, ఎమ్యెల్యే జక్కంపూడి రాజా వర్గాలను సముదాయించి దారికి తేవడంలో విఫలం అయ్యారని అంటున్నారు. ఈ రెండు గ్రూప్ లను భరించే కన్నా ఒకే గ్రూప్ కి అధికారాలు ఇచ్చి పార్టీ పరిస్థితిని కొంతకాలం తరువాత అంచనా వేయాలన్న ఆలోచనతో వైవి కఠిన నిర్ణయాలకు సిద్ధం అయి పోయారంటున్నారు. విడవమంటే పాముకు, కరవమంటే కప్పకు కోపం గా ఉన్న చందంగా రెండు గ్రూప్ లు ఎవ్వరు వెనక్కి తగ్గకపోవడంతో వైవి భరత్ వైపే మొగ్గు చూపడం చర్చనీయం అయ్యింది.
ఇటీవలే కొత్తగా చేరిన మాజీ ఎమ్యెల్యే చందన రమేష్ కుమారుడు నాగేశ్వర్ నేతృత్వంలో రెండు గ్రూప్ లు ముందుకు వెళ్ళాలని సుబ్బారెడ్డి ఆదేశించడం దానిపై రాజా వర్గానికి అరికాలి మంట నెత్తికెక్కినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ నేపధ్యం ఉన్న తమను జూనియర్ దగ్గర పనిచేయాలని కోరడంతో శివరామ సుబ్రహ్మణ్యం నెలరోజుల కిందటే రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. సుబ్బారెడ్డి తాత్కాలికంగా సుబ్రమణ్యానికి సర్ది చెప్పడం ఆ తరువాత ఆయన స్థానంలో మాజీ ఎమ్యెల్యే ఆకుల సత్యనారాయణ ను తెరపైకి తీసుకురావడంతో పొమ్మనకుండా వైవి పొగపెట్టేశారు అంటున్నారు. దాంతో సుబ్రహ్మణ్యం కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం ఆకుల వీర్రాజు ను సైతం పదవినుంచి సాగనంపక తప్పడం లేదని ఆయనకు సముచిత స్థానం పార్టీ లో ఇచ్చేందుకు ఒప్పందం అయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజమండ్రి లో రెండు గ్రూప్ లు స్థానం లో ఎంపి గ్రూప్ మాత్రమే మిగిలింది. జక్కంపూడి రాజా వర్గానికి రాజమండ్రి అర్బన్, రూరల్ లో చెక్ పెట్టి రాజానగరానికే ఆయన్ను పరిమితం చేసినట్లు అయ్యింది.గత నెల రోజుల క్రితం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను జక్కంపూడి రాజా వర్గం వారోత్సవాలుగా పెద్దఎత్తున నిర్వహించింది. ఆ కార్యక్రమాలతో మూడు నియోజకవర్గాలపై తన పట్టును రాజా టీం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ఎంపి భరత్ చక్రం తిప్పి అధిష్టానం దగ్గర తన పలుకుబడి చూపించారు. జక్కంపూడి రాజా కు రైట్ లెఫ్ట్ గా ఉన్న రెండు నియోజకవర్గాల కో ఆర్డినేటర్ లను కట్ చేసేశారు. ఇది జక్కంపూడి శిబిరాన్ని డిఫెన్స్ లో పడేసింది అంతేకాదు వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు లోను చేసింది.మరో పక్క ఎంపి పవర్ ను పార్టీ శ్రేణుల్లో మరోసారి చాటింది. అయితే వైసిపి కి అత్యంత బలహీనంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ మార్పులు మాత్రం టిడిపి వర్గాల్లో ఆనందాన్ని కలిగించాయి. ఇప్పటికే మూడు సార్లు కార్పొరేషన్ లో జండా ఎగురవేసిన తమకు మరోసారి వైసిపి అవకాశం కల్పించినట్లేనని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. కానీ భరత్ రామ్ కు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ నేటి ట్రెండ్ కి తగ్గట్లు దూకుడు గా వెళ్లడం తో ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా తన గ్రూప్ తో కార్పొరేషన్ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలిసి ఉంది. ఆ పనిలో ఆయన ఏమేరకు సక్సెస్ అవుతారన్నది చర్చనీయంగా మారింది. ఇది ఒక రకంగా భరత్ రామ్ రాజకీయ భవిష్యత్తుకు ముఖ్యమంత్రి జగన్ దగ్గర పడే మార్కులకు సవాల్ నిలుస్తుందనడంలో సందేహం లేదు.ప్రస్తుతానికి పార్టీలో తన ప్రత్యర్థులను ఎంపి ఎలిమినేట్ చేయగలగడంలో విజయం సాధించారు సరే టిడిపి ని అర్బన్ రూరల్ లో ధీటుగా ఎంతవరకు ఢీకొంటారనేది రాబోయే రోజుల్లో చూడాలి. జగన్ ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించే తత్వం కాదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే భరత్ రామ్ రాజకీయ భవిష్యత్తుకు సైతం గట్టి దెబ్బె తగిలే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం దగ్గర నుంచి కొత్త పవర్ సెంటర్స్ ఏర్పాటు కాకుండా చూసుకుంటూ మరోపక్క జక్కంపూడి రాజా వర్గాన్ని ఎదుర్కొంటు ఇంటా బయటా కాసుకోవడం ఎంపి భరత్ కి కత్తిమీద సాము కానుంది. దాంతో తూర్పుగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా రాజమండ్రి పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఏమి జరగనుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ గా మారింది.

Related Posts