తిరుపతి, ఫిబ్రవరి 2,
వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఆర్కే రోజా మంత్రి నారాయణ స్వామి మధ్య వివాదం మరింత ముదిరింది. స్థానికంగా తాను చేయాలని అనుకుంటున్న అభివృద్ధిని మంత్రి అడ్డుపడుతున్న విషయాన్ని రోజా .. ప్రతి వేదికపైనా ఇటీవల కాలంలో చర్చకు పెడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలోనూ రోజా కన్నీరు పెట్టుకోవడంతో పాటు.. కనీసం తనకు నియోజకవర్గంలో విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. వాస్తవానికి రోజా వర్సెస్ నారాయణ స్వామి.. వివాదం ఇప్పటిది కాదు. ఎన్నికలు ముగిసి, నారాయణస్వామి మంత్రి అయినప్పటి నుంచి కూడా ఉంది.అప్పట్లోనే మంత్రిగా నారాయణస్వామి.. నగరి నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఆయన నగరి పర్యటన చేసినప్పుడల్లా రోజాకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. తాను ఎమ్మెల్యే కనుక తనకు కనీసం ప్రొటోకాల్ ప్రకారం ప్రాధాన్యం ఇవ్వరా? అని ఆమె ప్రశ్నించారు. ఇక, ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో రోజా వర్సెస్ నారాయణ స్వామి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా నగరి నియోజకవర్గంలో పలు అభివృధ్ది కార్యక్రమాల కోసం.. రోజా ప్రయత్నిస్తున్నారు. అయితే. వీటికి సంబంధించిన భూసేకరణలు, అనుమతుల విషయంలో అధికారులు సహకరించడం లేదు. దీనికి నారాయణ స్వామి ప్రధాన కారణమనేది రోజా ఆవేదన. దీనిపైనే ఆమె ఇటీవల ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేశారు.ఇక, రోజా వాదన ఇలా ఉంటే.. నారాయణస్వామి వాదన మరోవిధంగా ఉంది. తనకు నగరి నియోజకవర్గా నికి సంబంధం లేదన్న ఆయన.. అయినా.. తాను మంత్రినని ఎక్కడికైనా వెళ్లి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఉంది. రోజాకు పోటీగా ఆయన నగరి నియోజకవర్గానికే చెందిన మరో కీలక నేత కేజే కుమార్ సతీమణికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించడంతో రోజా భగ్గుమంటున్నారు. నగరిలో కేజే కుమార్ దంపతులు మునిసిపల్ చైర్మన్లుగా పనిచేశారు. వీరికి కూడా ఇక్కడ సామాజిక వర్గంలోనే కాకుండా… పార్టీలతో సంబంధం లేకుండా బలగం ఉంది.ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి కేజే కుమార్ దంపతులను రోజాకు వ్యతిరేకంగా బాగా ఎంటర్ టైన్ చేస్తోన్న పరిస్థితి. అటు రోజా సైతం కేజే కుమార్ దంపతులకు చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్లకు పెద్దిరెడ్డి బలంగా సపోర్ట్ చేస్తుండడంతో రోజా ఏం చేయలేని పరిస్థితి. మరో షాక్ న్యూస్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో అవసరమైతే.. రోజా స్థానంలో ఆమెకు టికెట్ కూడా ఇప్పించేందు కు కూడా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారట. ఈ టెన్షన్‌తోనే రోజా సతమతమవుతుంటే నియోజకవర్గంలో కార్యక్రమాలకు ఇప్పుడు అధికారులు సహకరించకపోవడం… జిల్లాకే చెందిన మరో మంత్రి నారాయణస్వామి కూడా తనపై దూకుడుగా వస్తుండడం… అటు అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం రోజాను మరింత ఇరకాటంలోకి నెట్టడం గమనార్హం. ఏదేమైనా రోజాకు సొంత పార్టీలోనే శత్రువులు పెరిగిపోతున్నారు.