విజయవాడ, ఫిబ్రవరి 2
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. స్పీకర్ తమ్మినేని సీతారాం సయితం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన ప్రివిలైజ్ మోషన్ ను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందన్న చర్చ సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, అటు ప్రభుత్వం ఎవరూ తగ్గకపోవడంతో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతుంది.తమ పరిధిని దాటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వ్యవహరించారంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహించిన మంత్రులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం ఎన్నికలకు సహకరించకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. ఇలా ఎవరికి వారే తమకున్న పరిధిలో ఉన్న నిబంధనలను ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు ప్రివిలైజ్ కమిటీ సమావేశమై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలో 2008లో జరిగిన సంఘటనను కొందరు న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. 2008లో మహారాష్ట్రలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా సభాహక్కుల ఉల్లంఘన నోటీసును అందుకున్నారు. అయితే అప్పట్లో ఆయన నోటీసును అందుకోవడానికి కూడా నిరాకరించారు. దీంతో అప్పటి సభాహక్కుల ఉల్లంఘన కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు ఏడు రోజుల శిక్ష విధించింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని రెండు రోజుల పాటు శిక్షను తగ్గించారు.కనీసం గవర్నర్ ను, కోర్టును ఆశ్రయించాలన్నా అప్పటి మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు అవకాశం దక్కలేదు. తర్వాత హైకోర్టుకు వెళ్లినా ఎన్నికల కమిషనర్ కు అనుకూలంగా తీర్పు రాలేదు. తాము జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు అప్పట్లో కోర్టు స్పష‌్టం చేయడాన్ని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థిితి ఏపీలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వార్ ఎటువైపునకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.