చంద్రబాబు నేతలతో గ్యాప్ మెయింటెయన్ చేస్తున్నారా..,. పార్టీలో ఇటీవల జరుగుతున్న ధిక్కార పరిణామాలు భవిష్యత్తులో ప్రమాద సంకేతాలు కానున్నాయా...అంటే ఔననే సమాధానమే వస్తోంది. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న తమ అధినేత ఎవరినీ నియంత్రించలేక పోవడానికి కారణం స్వయంకృతమేనని స్పష్టం చేస్తున్నారు. పార్టీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల తిరుగుబాటు.. ప్రతి జిల్లాలోను కనిపిస్తోంది. దీనికి బాబు స్వయం కృతాపరాధమే కారణమని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ మీద పట్టు సాధించలేకపోవడానికి కారణం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలేనని అంటున్నారు. నేతలకు సమయం ఇస్తే వీటికి తెరదించవచ్చని, అయినా దానిపై దృష్టి సారించకుండా పేషీ అధికారులకు విడిచిపెట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, పార్టీ అధినేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమయం ఇవ్వడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. బాబుతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రముఖులతో ప్రతిపక్షంలో ఉండగా సావధానంగా మాట్లాడేవారని, ఇప్పుడు సిఎంవోలో సతీష్‌చంద్ర సిఎం పాత్ర పోషిస్తున్నారనే వ్యాఖ్యలు శివప్రసాద్ మాటలతో నిజమయ్యాయంటున్నారు. ‘మేం సార్‌తో అనేక విషయాలు మాట్లాడాలనుకుంటాం. కానీ సమయం ఇవ్వరు. ధర్మదర్శనం మాదిరిగా వెళ్లేముందో, వచ్చేముందో మాట్లాడాలి. ఏమన్నా అంటే సతీష్‌చంద్రతో మాట్లాడమంటారు. ఆయన ఆఫీసర్. మా బాధ ఆయనకేం తెలుస్తుంది? మేం ఏదైనా పార్టీ తీరుపై ఎప్పుడైనా ఆవేదనతో మాట్లాడితే పొద్దున్నే మేం గతంలో చేయించుకున్న పనులు, అడిగిన పనుల గురించి మా పత్రికలోనే రాయిస్తారు. ఇలాగైతే అధినేత మీద, ఆఫీసర్ల మీద నమ్మకం, విశ్వాసం ఎలా ఉంటాయని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మంత్రులకే సమయం ఇవ్వని పరిస్థితి ఉందని, ఏమైనా అంటే తెలంగాణలో కేసిఆర్ టైం ఇస్తున్నారా? అన్న ధోరణి యువ నాయకత్వంలోనూ మొదలుకావడం మంచిది కాదంటున్నారు. పార్టీలో గతంలో మాదిరిగా ఆత్మీయత లేదని, అవసరాలే కనిపిస్తున్నాయని, నాయకుడంటే ఎవరికీ భయంలేకుండా పోయిందనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని విశే్లషిస్తున్నారు. వైసిపిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వైనం పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి కారణవౌతోందని చెబుతున్నారు. వైసిపి నేతలు పార్టీలో చేరిన తర్వాతనే నేతలు రోడ్డెక్కుతున్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. ఇతర పార్టీల వారిని పార్టీలో తీసుకునే ముందు స్థానిక నేతలతో బలవంతంగా ఒప్పిస్తున్నారేతప్ప వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వనందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. బుచ్చయ్యచౌదరి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతమనేని ప్రభాకర్, కాగిత వెంకట్రావు, ఎంపి శివప్రసాద్ వీళ్లంతా పార్టీకి సైనికుల్లాంటివారని, అలాంటి నేతలే అసంతృప్తి గళం వినిపిస్తుంటే ఇక బయటకు వెళ్లగక్కని స్వరాలు ఇంకెన్ని ఉన్నాయో గ్రహించాలంటున్నారు. శివప్రసాద్ చేసిన వ్యాఖ్యల్లో ఏ ఒక్కటీ అబద్ధం కాదని, వాటిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా అనుకూల పత్రికలో రాయించడం వల్ల నేతలను నాయకత్వం నమ్మడం లేదనే సంకేతాలు పోతున్నాయని అంటున్నారు. అవసరమైనప్పుడు వారి బండారం బయటపెడతామన్న హెచ్చరిక సంకేతం పంపించడం వల్ల నాయకత్వం పట్ల ఎవరూ మనస్ఫూర్తిగా పనిచేయరని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. సొంత జిల్లాలోనే వినిపిస్తున్న ధిక్కార స్వరాలు చంద్రబాబు నాయకత్వానికి సవాల్‌గా మారాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బొజ్జల, శివప్రసాద్ వంటి నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్న వైనం వ్యక్తిగతంగా, పార్టీ అధినేతగా బాబుకు ఇబ్బందికరమేనంటున్నారు. సొంత జిల్లాలో పార్టీ నేతలను నియంత్రించలేని తమ అధినేతకు, ఇతర జిల్లాల్లో మా వైఫల్యాలను ప్రశ్నించే అవకాశం ఉండదన్న భావన మనసులో ఏర్పడుతుందని ఓ సీనియర్ నేత విశే్లషించారు. తొలినుంచీ చిత్తూరు జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్నా అక్కడ దృష్టి సారించడంలో నాయకత్వం విఫలమైందని, అదే వైఎస్ తన జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చుకున్నారని గుర్తుచేస్తున్నారు.