నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన
విజయవాడ, ఫిబ్రవరి 2,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై రాష్ట్ర సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మిగడ్డ రమేష్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించిన స్పీకర్ తమ్మినేని ఎస్‌ఈసీపై చర్యలు ప్రారంభించారు.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీకి సోమవారం సిఫార్సు చేశారు. మంత్రుల ఫిర్యాదును పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవలని స్పీకర్ ఆదేశించారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది.కాగా, సీనియర్ శాసనసభ్యులుగా, మంత్రులుగా ఉన్న తమ హక్కులకు భంగం కలిగించిన, తమ గౌరవాన్ని మంట గలిపేలా వ్యవహరించారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు రాసిన లేఖలో మాపై మోపిన నిందారోపణలు తీవ్రమైన బాధను, మానసిక వేదనను కలిగించాయి. ఆ కలతతోనే ఆ లేఖ గురించి మీ దృష్టికి తెస్తున్నాం. లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికలుగా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి’ అని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ తమ్మినేని ఆదేశించడం గమనార్హం. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మధ్య తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.