విజయవాడ, ఫిబ్రవరి 3,
అధికార పార్టీ వైసీపీకి అవసరానికి మించిన ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయినప్పటికీ ప్రతిపక్షపార్టీ టీడీపీని బలహీన పరిచే ఉద్దేశంతో ఆ పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలను వైసీపీలోకి ఆహ్వానించారు. ఇది ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగా లేకపోయినా వైసీపీలో మాత్రం నిప్పులు చెరిగే పరిస్థితిని తీసుకువచ్చింది. ప్రకాశం జిల్లా చీరాల, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి నిత్యం రగడలతో సతమతమవుతోంది. కేవలం అప్పటికప్పుడు పుట్టిన విభేదాలే అయితే అవి చల్లారిపోయేవి. కానీ, ఎన్నికలకు ముందు నుంచి ఉన్న విభేదాలు కావడం నాయకులను తీసుకుకోవడం కలిసి పనిచేయాలని ఆదేశించడం వంటి పరిణామాలు వైసీపీలో తీవ్ర వివాదానికి కారణంగా మారాయి.చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సందర్భం వస్తే పరోక్ష వ్యాఖ్యలతో నాయకులు వేడి పుట్టిస్తున్నారు. వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమంలో రెండు వర్గాలు బాహా బాహీకి దిగడం పార్టీ వర్గాలను కలవర పర్చింది. ఇక, కరణం పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కూడా రాత్రి వేళలో నిర్వహించిన ర్యాలీ కూడా కరణం.. ఆమంచి వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మత్స్యకారుల మధ్య వివాదాలను కూడా ఈ ఇద్దరు రాజకీయంగా వాడుకుని రోడ్డెక్కారు. ఈ పరిణామాలు గమనించిన వారు రెండు వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదని అంటున్నారు. చీరాలలో సొంత కేడర్ ఉండటంతో ఆమంచి స్ట్రాంగ్‌గా ఉన్నారు. బలరాంకు అద్దంకి కూడా ఆప్షన్ ఉంది. దీంతో ఈ పంచాయితీని ఎలా కొలిక్కి తెస్తారన్నది పెద్దగా ప్రశ్నగా మారిపోయింది.గన్నవరం విషయానికి వస్తే.. మరింతగా ఈ నియోజకవర్గం రగులుతోంది. నిత్యం ఎంతో ప్రశాంతంగా ఉండే గన్నవరంలో టీడీపీ తరఫున గెలిచిన వంశీని వైసీపీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వంశీకి, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మంటోంది. అలాగే వంశీపై 2014 ఎన్నికల్లో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు పడడడం లేదు. ఇటీవల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కనీసం గ్రామాల్లోకి కూడా వంశీని రాకుండా యార్లగడ్డ అనుచరులు అడ్డుకున్నారు. పార్టీ పెద్దలు ఏదో ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం మూడు వర్గాలు తయారయ్యాయి. అధిష్ఠానం ఆశీస్సులు ఉండటంతో వంశీ దూకుడుగా ఉన్నారు. కానీ, అదే రేంజ్‌లో ఒకవైపు యార్లగడ్డ.. మరోవైపు దుట్టాలు సవాళ్లు ప్రతిసవాళ్లతో గన్నవరం రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ పుంజుకోవడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.