ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మరో కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి గవర్నర్ కోసం యూకే ప్రభుత్వం కొందరు ప్రముఖ ఆర్థికవేత్తల పేర్లను పరిశీలిస్తోంది. యూకే ట్రెజరీ ఛాన్సెలర్ ఫిలిప్ హామండ్ ఇప్పటికే గవర్నర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్టు సమాచారం. రేసులో మొత్తం ఆరు మంది ఉన్నారని... అయితే, రేసులో తొలి స్థానంలో రాజన్ ఉన్నారని తెలుస్తోంది. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ బాధ్యతలను స్వీకరించారు. 2014లో ఐఎంఎఫ్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ, తిరస్కరించారు. ఆర్బీఐ గవర్నర్ గా 2016లో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నాక... అమెరికాలోని ఓ యూనివర్శిటీలో ఆయన ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.