YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*జీవితం... ఓ అద్భుతం* *నిర్మించండి..నిర్వహించండి*

*జీవితం... ఓ అద్భుతం* *నిర్మించండి..నిర్వహించండి*

యద్భావం తద్భవతి... మనం ఎలా భావిస్తే ఏదైనా అలాగే ఉంటుంది.... జీవితం అంటే ఓటమి కాదు గెలుపు జీవితం నీకు శత్రువు కాదు నీ ప్రియ సఖి దాన్ని ఆలించాలి... పాలించాలి*...
జీవితాన్ని ప్రేమించడం అందరికీ రాదు. జీవితంతో విసిగిపోవడం, జీవితాన్ని విసిగించడం... ఇదీ తంతు. జీవితం అంటే మరేమో కాదు. మన ఉనికి. మన ప్రతీ కదలిక. మన ప్రేమలు, ద్వేషాలు, విషాదాలు, మనతో సంబంధం కలిగిన మనుషులు, మమతలు, పరిస్థితులు,  ప్రదేశాలు... అన్నీ. అద్భుతమైన విషయం ఏంటంటే దాన్ని మనమే సృష్టించుకోవాలి. నిర్మించుకోవాలి.. నిర్వహించుకోవాలి. గౌరవించుకోవాలి. చివరకు జీవితాన్ని గెలిపించాలి. మరెందుకు మనం దాంతో విసిగిపోతున్నాం? ఆత్మహత్యల వరకూ వెళ్లిపోతున్నాం. మన జీవితమే మన శత్రువా? కాబట్టే మనం దాన్నుంచి పారిపోతున్నామా? ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మన చేతుల్లో రూపుదిద్దుకోవాల్సి ఉన్న జీవితం మనకు శత్రువేమిటి?! దాన్ని చూసి మనం భయపడడమేంటి?! కొన్ని విషయాలు విధి లిఖితమే కావచ్చు. కానీ చాలా విషయాలు నీ చేతుల్లోనే ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రాథమిక దశలోని జీవితం మన చేతిలోని మైనపు ముద్ద. అప్పుడే ఎదుగుతున్న లేలేత తీగ. మైనపు ముద్దను కావాల్సిన ఆకారంలోకి తీర్చిదిద్దుకోవచ్చు. తీగను సరైన పంథాలో సాగనిచ్చి పందిరికి అందించవచ్చు. ఎంత అందమైన పని ఇది! ఎంత ఆహ్లాదమైన పని ఇది! దాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరూ సరి చేసేందుకు రారు. మన సొంతం, మన ఆలోచన, మన అభిరుచి. అదీ జీవితాంతం. జీవితపు చివరి క్షణం వరకు. పసి పిల్లల్లా అల్లరి చేస్తూ, ఆనందిస్తూ, ఆహ్లాదిస్తూ, ఆస్వాదిస్తూ... ఎంత గొప్ప, అద్భుతమైన , మనదే అయిన అనుభవాలను రూపు దిద్దవచ్చు. అదే మన జీవితం.
ప్రకృతిని, పంచ భూతాలను... అన్నీ ఇచ్చి, శిలనూ ఇచ్చి, ఉలినీ ఇచ్చి మలుచుకోమన్నాడు భగవంతుడు. అలాఅని మన కర్మానికి మనను అలాగే వదిలేసిపోలేదు. మనలోనే ఉండి, మనల్నే గమనిస్తూ తడబాట్లను, పొరపాట్లను సవరిస్తూ ఆ ఉదారమూర్తి అందమైన వనరుగా, ఒక అద్భుతవరంగా ఇచ్చిన ఈ జీవితాన్ని విసిగిస్తున్నాం, విసిరేస్తున్నాం. ఇది కాదు జీవితం. ఇలా కాదు వినిమయం. అదే అందమైన దీర్ఘకాల అనుభవం. చివరి ఊపిరి వరకూ ఆగిపోని, కరిగిపోని తీయని మధుర స్వప్నం. ఆస్వాదిద్దాం. ఆఘ్రాణిద్దాం.
మన పరిస్థితులేవైనా సరే పూజ చేయాలంటే, ఎవరైనా మహాత్ములు వస్తున్నారంటే ఇల్లు, ఒళ్లు శుభ్రపరచుకుంటాం... జీవితం అంటే ఒక పూజ. జీవితం అంటే మనలో సహజస్థితుడై ఉన్న భగవంతునితో సహజీవనం. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి ఒత్తిడీ, ఎవరి పెత్తనమూ లేని మన సొంత క్రీడ. పందెమూ, ప్రత్యర్ధులు, గెలుపు, ఓటముల ప్రమేయం లేని ఒక అందమైన ఆట. అవన్నీ ఉన్నాయన్నా, లేవన్నా అదంతా మన సొంత బాధ్యత. స్వయంకృతం. దాన్ని మనం ఎంతో అపురూపంగా నడుపుకోవాలి.

Related Posts