YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

దిక్కులేని ఇంజనీరింగ్ కాలేజీ..

దిక్కులేని ఇంజనీరింగ్ కాలేజీ..
కేయూ ఇంజనీరింగ్ కాలేజీ వైపు కంపెనీలేవీ కన్నెత్తి చూడడం లేదు. ఈసారి ఇక్కడికి ఒక్కటి మాత్రమే వచ్చింది. ఫలితంగా విద్యార్థులు కోర్సులు పూర్తి చేశాక పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం పోరాడాల్సి వస్తోంది. ఎన్‌ఐటీ, ఇతర ప్రైవేటు కాలేజీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో దూసుకుపోతున్నాయి. వీటిలో చదివిన వారికి ఏడాదికి రూ. 10 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. కేయూలో 2009లో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభమైంది. సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ, ఈసీఈ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా లెక్చరర్ల కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయి అధ్యాపకులు నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 56 మంది ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్నారు. 30 మందికిపైగా పర్మినెంట్ లెక్చరర్లను నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం దీనిపై దృష్టిసారించడం లేదు. గత నెల నుంచి ప్రిన్సిపల్‌  లేరు. ఒక్కో బ్రాంచ్‌లో కనీసం 6 మంది రెగ్యులర్‌ ఫ్యాకల్టీ అవసరం కాగా, నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. పోనీ మౌలిక సదుపాయాలైనా  సరిగా కల్పించారా అంటే అదీ లేదు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో తృతీయ , చివరి సంవత్సరాల వారికి ల్యాబ్‌లు లేకపోవడంతో కిట్్స కళాశాలకు పరుగులు పెడుతున్నారు. డిజిటల్‌ గ్రంథాలయమూ అందుబాటులో లేదు.  సెమినార్‌ హాల్‌, ఆడిటోరియం, ఆంపీ థియేటర్‌ ఏవీ ఏర్పాటు చేయలేదు.
ఇక్కడ చదివే వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత పేదలే ఉన్నారు. మేటి ర్యాంకులు సాధించి ఇంజినీరింగ్‌ చేసి, మంచి కొలువులు సాధించాలని కోటి ఆశలతో వస్తున్న విద్యార్థులు ఆశించిన స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉండకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల కోసం ‘వెస్ట్‌లైన్‌’ అనే ఒకే కంపెనీ మాత్రమే వచ్చి 17 మందిని ఎంపిక చేసుకొంది. మరో 60 మందికి ‘టాస్క్‌’ తదితర సంస్థల ద్వారా ప్లేస్‌మెంట్లు దక్కాయి. చాలా మందికి ఆశించిన స్థాయిలో కొలువులు దక్కక కానిస్టేబుళ్లుగా, తప్పని పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌కు సంబంధించని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఓయూ ఇంజినీరింగ్‌ కశాశాల ఎంతో ప్రఖ్యాతి చెందిందింది. ఇందులో సీటు పొందడానికి పోటీపడతారు. కానీ కేయూలో మాత్రం సీట్లు మిగిలిపోతుండడం ఇక్కడి పనితీరుకు అద్దం పడుతోంది. 2017-18లో ఒక్కో బ్రాంచిలో ఏడు వరకు సీట్లు మిగిలిపోయాయి. మొత్తంగా 40 వరకు ఖాళీలున్నట్లు సమాచారం. కనీసం వచ్చే విద్యా సంవత్సరంలోనైనా విద్యాలయాన్ని మేటిగా తీర్చిదిద్దితే గ్రామీణ విద్యార్థులకు వరంగా మారుతుంది.

Related Posts