YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, ఫిబ్రవరి 4, 
కేంద్ర బడ్జెట్‌ తంతు ముగిసింది. ఇక రాష్ట్ర బడ్జెట్‌ వంతు మిగిలింది. ఈ క్రమంలో తెలంగాణలో వసూలు కాకుండా ఉండిపోయిన పన్నులు, సం బంధిత బకాయిలను పకడ్బందీగా రాబట్టాలంటూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రయివేటు, కార్పొరేట్‌ పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు, వాణిజ్య సముదాయాల యాజమాన్యాలను నయాన్నో, భయాన్నో ఒప్పించటం ద్వారా అధికమొత్తంలో పన్నులను వసూలు చేయాలంటూ వాణిజ్య పన్నుల శాఖకు సూచించింది. దీంతో ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సమన్వయ సమావేశాలను నిర్వహిస్తుండగా... కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పన్నులు, వాటి బాకీలను వసూలు చేయటంలో బిజీగా ఉన్నారు. మార్చిలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున ఈనెలాఖరు నాటికి వీలైనంత ఎక్కువ మొత్తంలో ట్యాక్సులను వసూలు చేయాలని వారు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తద్వారా బడ్జెట్‌ నాటికి తమ శాఖ నుంచి ఖజానాకు ఎక్కువ మొత్తాన్ని సమకూర్చేందుకు వీలుగా కసరత్తులు ముమ్మరం చేశారు. అయితే ప్రతీయేటా బడ్టెట్‌కు రెండు నెలల ముందు ఈ ప్రక్రియ సర్వసాధారణమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేతప్ప ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేశాయి.మరోవైపు కోవిడ్‌తోపాటు ఇతరత్రా కారణాల వల్ల సర్కారుకు అనుకున్నంత స్థాయిలో వాణిజ్య పన్నులు వసూలు కాలేదు. మార్చితో ముగియబోయే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కమర్షియల్‌ ట్యాక్సుల రూపంలో మొత్తం రూ.32,671 కోట్లు వసూలవుతాయని సర్కారు అంచనా వేసింది. ఇందులో గత డిసెంబరు నాటికి కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్‌టీ) రూ.2,586 కోట్లు పోను రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ) కింద వసూళ్లు రూ.14,967 కోట్లుగా నమోదయ్యాయి. దీంతోపాటు అమ్మకపు పన్ను (సేల్స్‌ ట్యాక్స్‌.. దీన్నే ఇప్పుడు వ్యాట్‌ అంటున్నారు) కింద మరో రూ.14,193 కోట్లు వసూలైంది. ఇవి రెండూ కలిసి రూ.29,160 కోట్లయ్యాయి. ఈ లెక్కన సర్కారు వేసుకున్న అంచనాల్లో రూ.3,511 కోట్ల ఆదాయం తగ్గిందన్నమాట. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్నవి డిసెంబరు లెక్కలే అనుకున్నా... చివరి త్రైమాసికం (2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో ఒకేసారి రూ.3,511 కోట్లు వస్తాయా..? అంటే వాణిజ్య పన్నుల శాఖ నుంచి అంత మేర పన్నులు వసూలు కాకపోవచ్చుననే సమాధానమే వినిపిస్తున్నది.

Related Posts