పోలవరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.2,900 కోట్లు కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులో భాగంగా మరో కీలక నిర్మాణాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. తర్వాత, ‘పోలవరం’ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.అనంతరం, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఆయన, డయాఫ్రమ్ వాల్ ను, గోదావరి నీటి మళ్లింపును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కూడా ‘పోలవరం’కు అడ్డుపుల్ల వేస్తోందని, నిధులు సక్రమంగా విడుదల చేయడం లేదని, ఎవరెన్ని కుట్రలు పన్నినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం వల్ల రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామని, 200 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ప్రజలు ఇబ్బందులు పడి తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని, దీనిని అవకాశంగా తీసుకుని తమను గద్దె దించి ప్రతిపక్షం అధికారంలోకి రావాలని చూస్తోందని, ప్రతిపక్ష పార్టీ తమ టీవీ ఛానెల్, పత్రికను అడ్డం పెట్టుకుని తమపై బురదజల్లేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై విషం చల్లడమే ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా పనిగా పెట్టుకుందని విమర్శించారు.కేంద్రంపై నాలుగేళ్ల నుంచి పోరాడకుండా ఇప్పుడు పోరాటం చేయడమేంటని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని, వాళ్లు చెప్పినట్టుగా చేసినట్టయితే.. ఈ ప్రాజెక్టు ఇంతవరకు వచ్చేది కాదని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేదని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్ల పాటు సామ,దాన, భేదాలు వాడాను. ప్రస్తుతం దండోపాయానికి వచ్చానని అన్నారు. ‘మహాభారతంలో కూడా అదే జరిగింది. ఐదు గ్రామాలివ్వమని పాండవులు అడిగితే.. ఇవ్వమని కౌరవులు చెప్పడంతో కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. కౌరవులకు పాండవులు బుద్ధి చెప్పారు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ధర్మం మన సైడ్ ఉంది. న్యాయం మన సైడ్ ఉంది. అందుకే, ధర్మపోరాటానికి మొన్ననే శంఖారావం పూరించాను. దీనిని వదిలిపెట్టను’ అని అన్నారు.