విజయవాడ, ఫిబ్రవరి 5,
గాజు గదిలో ఉన్న ప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్నప్పుడు కూడా అంతే. ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిదీ అదే పరిస్థితి. ఇటు స్వపక్షంలోనూ, అటు విపక్షంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ అయ్యారు. ప్రధానంగా పోలీసు శాఖ విషయంలో హోంమంత్రి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. అధికారంలోకి రాగానే ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. మాజీ పాత్రికేయుడు కావడంతో ఆయనకు లైజనింగ్ కూడా తెలియడంతో కొన్ని ప్రాంతాల పార్టీ బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ కు అప్పగించారు. దీంతో ఇటు ఆయన ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను పరిశీలించాల్సి వస్తుంది. అందరీని సమన్వయం చేసుకుని వెళ్లాల్సి వస్తుందిప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై హోంశాఖకు సంబంధించిన విమర్శలు విన్పిస్తున్నాయి. హోంశాఖ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారని, మంత్రి డమ్మీయేనంటున్నారు. ఇక విపక్షాలయితే సజ్జల రామకృష్ణారెడ్డినే టార్గెట్ చేశాయి. ఎక్కడ ఏ కేసు పెట్టినా సజ్జలపైనే ఆరోపణలు చేస్తున్నారు. మొన్నా మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి సయితం సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలతోనే ఇక్కడ పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ నేతలు సయితం పోలీసుల కేసులపై సజ్జల రామకృష్ణారెడ్డినే ఎక్కువగా తప్పుపడుతున్నాయి.ఇక స్వపక్షంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైకి ఎవరూ ఏమీ అనకపోయినా లోలోపల మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. మంత్రులు సయితం ఆయనకు చెప్పనిదే ఎటువంటి ప్రకటనలు, నిర్ణయాలు తీసుకోకూడదన్న టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా తమ పనుల కోసం సజ్జల రామకృష్ణారెడ్డినే ఆశ్రయిస్తున్నారు. ఆయన చెబితేనే అధికారులు పనులు చేస్తుండటంతో సొంత పక్షం ఎమ్మెల్యేలు కూడా సజ్జలపై మండిపడుతున్నారు. మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు స్వపక్షానికి, అటు విపక్షానికి టార్గెట్ గా మారారు.