నెల్లూరు, ఫిబ్రవరి 5,
నగరాలు, పట్టణాల్లో వ్యాపారమంటే చిన్న విషయం కాదు. రూ.వేలల్లో అద్దె, రూ.లక్షల్లో గుడ్‌విల్ చెల్లించాల్సి ఉంటుంది. చిన్న వ్యాపారులకు ఇది సాధ్యం కాదు. దీంతో వీధులు, రహదారులే వీరికి వ్యాపార ప్రాంతాలు. పట్టణాల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వాణిజ్య జోన్లను ఏర్పాటు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి అండగా నిలవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ కర్నూలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. కర్నూలు నగరంలోని మెప్మా కార్యాలయంలో గుర్తింపు కార్డులు మూలన పడేశారు.
జిల్లా జనాభా సుమారు 45 లక్షలు. అధికారులు లెక్కల ప్రకారం జిల్లాలో తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు, రోడ్డు సైడు చిన్న వ్యాపారులు సుమారు 14 వేల మంది ఉన్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రదాన రహదారులు, వీధులను ఆసరాగా చేసుకుని రోజూ వేలాది మంది విక్రయదారులు వ్యాపారం చేస్తున్నారు. రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో పోలీసులు, స్థలాలను ఆక్రమించారంటూ పురపాలక సంఘం అధికారుల నుంచి ఏదో ఒక సమయంలో వీరు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. పట్టణాల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వాణిజ్య జోన్లను ఏర్పాటు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి అండగా నిలవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతంలో మెప్మా ఆధ్వర్యంలో 5,564 మందిని గుర్తించినా 3,924 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నిర్ధేశించిన కొన్ని పనులు : నగరాలు, పట్టణాల్లో చిరు వ్యాపారులకు వీధులు, రహదారులే వీరికి వ్యాపార ప్రాంతాలు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ప్లాస్టిక్ సామాగ్రి, చిరుతిండ్లు, టీ, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్, కొబ్బరి బోండాల విక్రయాలు, కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకునే దర్జీవారు, చెప్పులను కుట్టుకుని జీవనం సాగించే వారు, రోజువారీ వడ్డీలు చెల్లిస్తూ నగరాలు, పట్టణాల్లో రహదారులను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు చేస్తుంటారు. పురపాలక, నగర, కార్పొరేషన్‌లలోని వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వం జీవో 481 విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం వారి వ్యాపారానికి స్థలం కేటాయించాలి. ప్రభుత్వం గుర్తించిన వీధుల్లో బండ్లు పెట్టుకునేందుకు, నీడనిచ్చే షెడ్ల వంటివి నిర్మించాలి. పది మందిని కలిపి ఒక బృదం(గ్రూప్)గా చేసి రుణాలు అందించాలి. పురపాలక అధికారులు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి. వీధి వ్యాపారుల్లో అత్యధికులు వడ్డీలకు సొమ్ములు తెచ్చుకుని వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు అందించేలా 10 మందితో ఒక పొదుపు సంఘాన్ని వడ్డీ లేని రుణాలు అందజేసేందకు ఏర్పాటు చేశారు. రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు రుణం అందించడమే కాకుండా వ్యాపార అభివృద్ధిలో మెలకువలను వివరించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, కుటుంబ సభ్యులతో కూడిన మరో కార్డును ఇవ్వాలి. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను ఆ కార్డులో పొందుపరిచాలి. వీటిని స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో అందజేయాలి. కానీ అమలులో అధికారులు ఊగిసలాడుతున్నారు. ఇప్పటికీ చాలా గుర్తింపు కార్డులు మెప్మా కార్యాలయంలోనే పడి ఉన్నాయి. చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలకు అవసరమైన మేరకు బ్యాంకుల ద్వారా రుణాలను కల్పించి వారి ఆర్ధిక పురోగాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.