విశాఖపట్టణం, ఫిబ్రవరి 5,
అది ఒకప్పుడు నగరానికి క్రీడా శిఖరం... ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులును, మరెన్నో ఉత్కంఠ రేపిన పోటీలను చూసిన నేల. ప్రతిభ మెరిసిన వేళ... విజయం మురిసిన వేళ... ఎన్నెన్నో మధురానుభూతులు పంచిన మైదానం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నం. గ్యాలరీలు దెబ్బతిన్నాయి. క్రీడాభిమానులు కూర్చొని మ్యాచ్ తిలకించే పరిస్థితి లేని విధంగా అవి ఉన్నాయి. పై కప్పులు పాడైపోయాయి. మరుగుదొడ్లు రోత పుట్టిస్తున్నాయి. మైదానం తప్ప మిగతా అన్ని వ్యవస్థలు కొడిగట్టాయి. ఇది నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియం ప్రస్తుత పరిస్థితి. ఒకప్పుడు దిగ్గజ క్రీడాకారులు నడియాడిన నేల ఇప్పుడిలా చేవజచ్చి ఉండటాన్ని చూసి పలువురి క్రీడాభిమానుల మనస్సు తరుక్కుపోతోంది.అలనాటి క్రికెటర్లు కపిల్ దేవ్, వివిఎన్.రిచర్డ్స్, దిలీప్ వెంగ్‌సర్కార్, కష్ణమాచార్య శ్రీకాంత్, రవి శాస్త్రిలు ఈ పెవిలియన్‌లోనే కూర్చుని సందడి చేశారు. పలువురు అంతర్జాతీయ విదేశీ క్రికెటర్లకు సైతం సుపరిచితమైన స్టేడియం ఇది. అంతటి స్టేడియం నేడు నిరాదరణకు గురైంది.స్టేడియంలో ఏ మూల చూసినా పాడైపోయిన ద్వారాలు, కిటికీలే దర్శనమిస్తున్నాయి. జివిఎంసి అధికారులు, నేతలు దీర్ఘకాలంగా ఈ మైదానాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడి స్టేడియానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, రూ.కోట్లు ఖర్చు చేస్తామని పలుమార్లు నేతలు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి.మహా విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12.8 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకురావాలని తొమ్మిదేళ్ల క్రితం అప్పటి జివిఎంసి ప్రత్యేక అధికారి శ్యాంబాబు నాటి కమిషనర్ ఎంవి.సత్యనారాయణను ఆదేశించారు. అప్పటి వుడా, జివిఎంసి సంయుక్తంగా రూ.3.50 కోట్లతో అభివద్ధి చేయాలని ప్రతిపాదించారు.2013లో జివిఎంసి రూ.1.5 కోట్లతో అండర్ గ్రౌండ్ స్టేడియంలో మెట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థను అభివద్ధి చేసింది. వుడా రూ.2 కోట్లతో చేపట్టాల్సిన పెవిలియన్ అభివద్ధి పనులను సగంలోని నిలిపివేసింది. 2014 అక్టోబర్ 12న నగరంలో సంభవించిన హుదూద్ పెను తుపానులో నేలకొరిగిన చెట్లు, వాటి ఖాండాలు వేయడానికి స్టేడియాన్ని వినియోగించడంతో అప్పట్లో మైదానం పూర్తిగా పాడైపోయింది.గతంలో చేపట్టిన పనులు కూడా నాసిరకంగా ఉండటంతో మురుగు నీటి పారుదల వ్యవస్థ, కూర్చోడానికి ఏర్పాటు చేసిన మెట్లు కూడా మరమ్మతులకు గురయ్యాయి. హుదూద్ అనంతరం స్టేడియం అభివద్ధికి కొంత మేర నిధులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వీటితో కొన్ని పనులు మొదలు పెట్టినా అవి కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. స్టేడియం చుట్టూ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలి.ముఖ్యంగా స్టేడియానికి కూతవేటు దూరంలో పోర్టు ఉండటంతో కాలుష్యం బారిన పడకుండా స్టేడియం చుట్టూ ప్రహరీ ఎత్తు మరింత పెంచాలి స్టేడియంలో మైదానాన్ని మరింత మెరుగు పరచాలి. మట్టితో నింపి పూర్తిగా రోలింగ్ చేసి గడ్డి వేస్తే అద్భుతంగా తయారవుతుందిజాతీయ స్థాయిలో పోటీల కోసం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే క్రీడాకారులకు వసతి కల్పించలేని దుస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టేడియంలో ఉన్న గదులుకు తోడు మరిన్ని అదనపు గదులు నిర్మిస్తే రెండు వేల మందికి ఇక్కడ వసతి కల్పించవచ్చు.స్టేడియం అటూఇటూ బయట గల ఖళీ స్థలంలో టెన్నిస్, బాస్కెట్ బాల్, త్రో బాల్, హ్యాండ్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, కరాటే, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ తదితర 13 రకాల క్రీడలను ఆడించుకోవచ్చు. స్టేడియాన్ని అభివృద్ధి పరిస్తే క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ క్రీడలు ఆడుకోవచ్చు.ముఖ్యంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు సొంత కార్యాలయం లేదు. ఆ సంస్థ కార్యాలయం ప్రస్తుతం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉంది. అక్కడి కార్యాలయాన్ని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి మార్చి శాప్ అధికారులకు అప్పగిస్తే స్టేడియం మరింత అభివద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.