YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

జోన్న పంటలకు ఫుల్ డిమాండ్

జోన్న పంటలకు ఫుల్ డిమాండ్

నిజామాబాద్, ఫిబ్రవరి 5, 
మార్కెట్లో జొన్న రొట్టెలకు భలే గిరాకీ పెరిగింది. పట్టణాల్లో జొన్నలు లేకపోవడంతో హోటళ్లలో ఒక్క జొన్న రొట్టెకు రూ.10 నుంచి 15 వరకు కొంటున్నారు. కర్రీ పాయింట్లలో రూ.10 రూపాయలకు ఒక్క రొట్టె లభిస్తున్నది. చాలా మందికి జొన్న రొట్టె చేయడం రాదు. దీంతో వారు హోటళ్లు, కర్రీ పాయింట్లలో జొన్న రొట్టెలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రొట్టెలకు భలే గిరాకీ ఏర్పడింది. జొన్న పంట...ఒకప్పుడు తెలంగాణలో సంప్రదాయ పంట...జొన్న రొట్టె, రాగి సంకటి తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారంగా ఉండేది. కాలక్రమేనా వరి సాగు పెరగడం, చాలా మంది అన్నం తినేందుకు మొగ్గు చూపడంతో రాను రానూ జొన్నసాగుపై ప్రభావం చూపింది. కానీ, ఇటీవల ప్రజల్లో అవగాహన పెరగడం జొన్న, గోధుమ రొట్టెలు తింటే శరీరానికి అందే పోషకాలతోపాటు, ఆరోగ్యానికి కలిగే లాభాలు తెలియడంతో జనం మళ్లీ రొట్టెలు తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల పెరుగుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అన్నంతోపాటు రోజూ రొట్టెలను తినడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మధుమోహ వ్యాధి గ్రస్తులకు జొన్న రొట్టెతో అధిక లాభాలు ఉన్నాయి. ఇది ఒంట్లో షుగర్ పెరగకుండా చేయడంతోపాటు అధిక పీచుపదార్థం ఉండటంతో తేలికగా జీర్ణం అవుతుంది. మునిపల్లి మండలంలో ఇదివరకు జొన్న సాగు జోరుగా ఉండేది. జొన్న సొప్పను రైతులు పశువులకు ఆహారంగా అందించేవారు. దీంతో గతంలో ఎక్కువ శాతం జొన్నపంట సాగయ్యేది. ఇక ప్రతి ఇంట్లో జొన్నరొట్టెలు చేసుకుని తినేవారు. కానీ రోజురోజుకూ సాగువిస్తీర్ణం తగ్గిపోతున్నది. పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు రాకపోవడంతో చాలా మంది రైతులు జొన్నసాగుపై దృష్టి సారించడం లేదు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను అందించడంతో పాటు, ప్రభుత్వం జొన్న పంటలపై అవగాహన కల్పిస్తే ఆ పంట సాగుపై దృష్టి సాధించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.జొన్న రొట్టెలను ఒకప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే తినేవారు. నేడు అన్ని వర్గాల ప్రజలు రొట్టెలను ఆహారంగా తీసుకుంటున్నారు. వయస్సు, ప్రాంతంతో పనిలేకుండా చాలా మంది మధుమోహ వ్యాధికి గురవుతున్నారు. ముఖ్యంగా శ్రమజీవుల కంటే ధనికవర్గాల్లో మధుమోహ వ్యాధి కనిపిస్తోంది. జొన్నరొట్టెలను తినాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. అతి సులువుగా జీర్ణమయ్యే ఈ జోన్న రొట్టెలు వృద్ధులు,పిల్లలు సైతం ఇష్టపడుతున్నారు. జొన్నసాగు తగ్గిపోవడంతో జొన్నల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సరైన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు అధికంగా పెరుగతున్నాయని వినియోగదారులు అంటున్నారు. గతంలో క్వింటాల్‌కు రూ.1000 నుంచి 1500 వందల లోపు వచ్చే జొన్నలు ప్రస్తుతం రూ.3 నుంచి 4 వేల వరకు మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా అడవి పందుల బెడద ఎక్కువగా నష్టం చేయడంతో రైతులు తక్కువ మొత్తంలో జొన్న పంటలను సాగుచేయాల్సిన దుస్థితి నెలకొంది. జొన్నపంట సాగు విస్తీర్ణం పెరుగాలంటే పందుల బెడదను తొలగించాలని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం జొన్నలు మార్కెట్లో దొరకకపోవడంతో పక్కరాష్ట్రమైన కర్ణాటక నుంచి కొనుగోలు చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది.

Related Posts