YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

విద్యార్థులకు రక్షణేదీ..?

విద్యార్థులకు రక్షణేదీ..?
విద్యాలయాలకు రక్షణ కొరవడుతోంది. కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తామని ఓ వైపు అధికారులు, మరో వైపు ప్రజాప్రతినిధులు చెబుతున్నా అవేమీ ఆచరణలో అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు భద్రత కరవైంది. పాఠశాలలకు ప్రహరీలు లేకపోవటంతో సెలవు రోజుల్లో, రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. చదువుల తల్లి కొలువై ఉన్న విద్యాలయాలు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనందించాల్సి ఉండగా అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. సెలవుల్లో ఆకతా యిలకు అడ్డాగా మారుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని విధాలా భద్రతగా ఉండాల్సిన ప్రహరీలు లేకపోవటంతో కనీస రక్షణ కరవైంది. ఊరికి దూరంగా ఉండే పాఠశాలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. సాయంత్రానికి పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఇళ్లకు చేరుకోగానే ఆకతాయిలు, గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరి అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తున్న వైనం తరచూ చోటు చేసుకుంటోంది. పాఠశాల ఆవరణలోని క్రీడావస్తువులను, తలుపులను, పరికరాలను, అక్కడ ఏర్పాటు చేసిన దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
మందుబాబులు విందులు చేసుకుంటూ సేవించిన మద్యం ఖాళీసీసాలను, తిన్న ఆహార సంచులను అక్కడే పడేస్తుండటం సర్వసాధారణమైంది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పేకముక్కలు, సీసాలు దర్శనమిస్తుండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని చోట్ల పాఠశాలల్లోని విలువైన కంప్యూటర్‌ పరికరాలు చోరీకి గురవుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు రూ.లక్షలు వెచ్చించి డిజిటల్‌ తరగతులు, కంప్యూటర్‌ పరికరాలు విద్యాశాఖ సమకూరుస్తోంది. పాఠశాలల అభివృద్ధికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నా పాఠశాలల ప్రహరీల నిర్మాణంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తుంది. దీంతో పాఠశాలలకు భద్రత కరవైంది. వేసవి సెలవులు వచ్చాయంటే పాఠశాలల్లో దొంగలు చొరబడి విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. అంతే కాకుండా సరైన నిఘా(కాపలా) లేక అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాలలు వేదికగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలలకు చెరువులు, కాలువలు సమీపంలో ఉన్నాయి. వీటికి ప్రహరీలు లేకపోవడంతో ప్రమాదభరితంగా ఉన్నాయి. మరో 10 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. సెలవుల్లోనైనా ప్రహరీలు నిర్మించి పాఠశాలల ప్రారంభంనాటికి పూర్తి చేసి భద్రత కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు భద్రత కరవైంది. పాఠశాల ఆవరణలోని క్రీడా వస్తువులు, తలుపులను, పరికరాలను, అక్కడ ఏర్పాటు చేసిన దేశ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో   272 ప్రాథమికోన్నత, 464 ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 2.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలల సంఖ్య ఘనంగా ఉన్నా వాటికి రక్షణగా ప్రహరి లేనివి 80శాతానికి పైగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఉదాహరణకు ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో  226 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు పనిచేస్తుండగా వీటిలో 181 పాఠశాలలకు ప్రహరీలు లేవు. మరోవైపు ప్రహరీలు లేకపోవటంతో స్థలాలకు హద్దులు తెలియక పోవడంతో విలువైన భూమి ఆక్రమణకు గురవుతోంది. గతంలో పలుమార్లు భీమడోలు ఉన్నత పాఠశాలలో దొంగలు పడి కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. దీనికి ప్రధాన కారణం విశాలమైన పాఠశాలకు రక్షణగా ప్రహరీ లేకపోవటం, రాత్రి వేళల్లో నిఘా లేకపోవటమే. ఉంగుటూరు మండలం దొంతవరం గ్రామంలో చెరువుకు ఆనుకునే ప్రాథమిక పాఠశాల ఉంది. అదే ఆవరణలో అంగన్‌వాడీ కేంద్రం కూడా పనిచేస్తుంది. అయితే చెరువుకు, పాఠశాలకు మధ్య ఎటువంటి రక్షణ ఏర్పాటు లేకపోవటంతో నిత్యం ప్రమాదపుటంచున విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌ ద్వారా నిధులు విడుదలవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు అదనపు తరగతి గదులు సమకూరుతున్నా ఏకారణం చేతనో ప్రహరీల నిర్మాణం అమలుకు నోచుకోవటంలేదు.
 ప్రహరీలు లేని ప్రభుత్వ పాఠశాలలకు రక్షణగా బయోఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు గతేడాది ఉన్నతాధికారులు ప్రతిపాదనలు చేశారు. కొన్ని పాఠశాలల్లో మొక్కుబడిగా ఈతంతును నిర్వహించారు. అటవీశాఖ, విద్యాశాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఉపాధిహామి పథకం ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం పర్యవేక్షణ, చిత్తశుద్ధి లేకపోవటంతో అమలు కాలేదు. భీమడోలులోని దళితవాడ అయిన అరుంధతీ కాలనీలో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేకపోవటంతో గతేడాది బయోఫెన్సింగ్‌  పేరిట అధికారులు కొన్ని మొక్కలు నాటారు. దీన్ని మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారు. కాలం గడిచేకొద్ది నాటిని కొద్ది మొక్కలు కూడా చనిపోయాయి.

Related Posts