*క్షేత్ర దర్శనం*
శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వైకుంఠనారాయణ పెరుమాళ్ ఆలయం తిరువారూర్ సమీపంలోని మణక్కల్ అయ్యాపేట్టైలో వెలిసియుంది. ఈ వైకుంఠ పెరుమాళ్ మానవుల కుటుంబ సమస్యలన్నీ తీర్చి సుఖశాంతులను ప్రసాదించే దైవమని భక్తులు కీర్తిస్తారు. ఈ ఆలయ స్ధలవృక్షం అత్తిచెట్టు. తీర్ధం రాజపుష్కరిణి. సుమారు 700 సంవత్సరాల క్రితం చతుర్వేదాలను అధ్యయనం చేసిన 400 బ్రాహ్మణ కుటుంబాలు ఈ అయ్యాపేట్టైలో నివసిస్తూ వుండేవి. వారంతా శ్రధ్ధాభక్తులతో శ్రీమహావిష్ణువు కి నిత్యం పూజలు, ఉత్సవాలు వైభవంగా జరిపేవారు. అలాటి సమయంలో 13 వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అల్లవుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ నాయకత్వాన దక్షిణాది రాజ్యాలను ఆక్రమించి అనేక ఆలయాలను ధ్వంసం చేశారు. అలాటి దేవాలయాలలో ఈ ఊరి ఆలయం కూడ నేలమట్టమైపోయింది. వేద బ్రాహ్మణులు అనేక హింసలకు లోనయ్యారు. అయినా వారంతా తాము పూజించే శ్రీవైకుంఠనారాయణుని విగ్రహాన్ని భూమికి అడుగున భద్రపరిచారు. తర్వాత కొన్ని శాబ్దాలు గడిచాక ఈ అయ్యాపేట్టై వాస్తవ్యుడు , మద్రాస్ వైద్యకళాశాలలో ఉన్నతాధికారిగా పదవి విరమణ చేసిన శ్రీ శివరామన్ అనే భక్తుని స్వప్నంలో దర్శనమిచ్చిన పెరుమాళ్ తనకు ఒక ఆలయం నిర్మించ వలసినదిగా సందేశమిచ్చాడు. దైవసంకల్పాన్ని తలదాల్చి శివరామన్ తన స్వంత ధనంతో ఆలయాన్ని పునరుధ్ధరిస్తున్న సమయంలో , విదేశీయుల దండయాత్ర సమయాన భూమిలో భద్రపరచిన 23 ఆపూర్వ
విగ్రహాలు బయల్పడ్డాయి. అవన్నీ ఇప్పుడు వున్న ఆలయంలో పునః ప్రతిష్టించబడడం అందరినీ విస్మయపరిచే విషయం. ప్రాచీనకాలం నుండే మార్గశిరమాసంలోని ప్రతీ శుక్రవారం నాడు పెరుమాళ్ యొక్క పాదాలను నవగ్రహాలలోని శుక్రుడు కాంతి రూపంలో వచ్చి పూజిస్తాడని ఐహీకం. ఈ ఆలయంలోని మహావిష్ణువు ని కుబేరుడు పూజించినట్లు భక్తులు నమ్ముతారు. అందువలన శుక్రదోష పరిహారానికి , భాగ్యస్ధాన దోష పరిహారానికి యీ ఆలయం చాలా ప్రఖ్యాతి గాంచినది. మూడు అంతస్థుల రాజగోపురంతో నిర్మించబడిన ఆలయం. లోపలి ఆవరణలో ధ్వజస్తంభం, గరుడాళ్వారు సన్నిధిని దర్శించుకొని లోపలికి వెళ్తే ముఖమండపాన్ని చేరుకుంటాము. గర్భగుడిలో శ్రీ వైకుంఠనారాయణ పెరుమాళ్ ఆశీన భంగిమలో దర్శనమిస్తున్నాడు. ఆయన సమీపమున శ్రీ దేవి ,భూదేవి దర్శనం ప్రసాదిస్తున్నారు. ఉత్సవమూర్తులు వున్నవి. చక్రత్తాళ్వారుకి ప్రత్యేక సన్నిధి వున్నది. వైకుంఠము నుండి ఏకంగా భూలోకానికి వచ్చి అనుగ్రహిస్తున్న వైకుంఠ పెరుమాళ్ గా ఈ దేవుడు కీర్తించబడుతున్నాడు. ఆయన దర్శనమిస్తున్న ఆలయమే వైకుంఠమైనందున యీ ఆలయంలొ ఉత్తర దిశన ప్రత్యేకించి స్వర్గద్వారం అంటూ మరేదీ లేదు.
శుక్రుడు అధిదేవతగా వున్న ఆలయం శ్రీ రంగం. శుక్రుడు ఈశ్వరుని ఆరాధించిన స్ధలం కంజనూరు. ఈ పెరుమాళ్ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో కాంతి రూపంగా వచ్చి పెరుమాళ్ ని పూజించి తన శక్తిని సమర్పిస్తున్నాడు. ఈ ఆలయంలో వైకుంఠ నారాయణుని మహిమ మార్గశిరమాసంలో ద్విగుణీకృతమై అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడని ఐహీకం. శుక్రుడు ఆరాధించే ఆలయమైనందున ఇక్కడ కి వచ్చి పూజించే భక్తులకి శుక్రయోగం లభించి సకల ఐశ్వర్యాలు లభించి సుఖ సంతోషాలు పొందుతారు. తిరువారూరు కుంభకోణం మార్గంలో తిరువారూరు నుండి 12 కి.మీ దూరంలో మణక్కాల్ అయ్యాపేట్టై వున్నది.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో