YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విదేశీయం

పోర్టు డీల్ కు లంక రాం..రాం

పోర్టు డీల్ కు లంక రాం..రాం

పోర్టు డీల్ కు లంక రాం..రాం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6, 
భారత్, జపాన్‌లతో చేసుకున్న ఒప్పందాన్ని తోసిరాజని కొలంబో ఓడరేవు తూర్పు టెర్మినల్ నూటికి నూరు శాతం ప్రభుత్వ యాజమాన్యంలోని శ్రీలంక పోర్టు అధారిటీ నిర్వహణలో నడుస్తుందని శ్రీలంక కేబినెట్ మంగళవారం సంచలనాత్మకమైన మినిట్స్‌ని విడుదల చేసింది. అంటే గతంలో భారత్, జపాన్‌లతో పోర్టు అభివృద్ధి ఒప్పందాన్ని శ్రీలంక తనకు తానుగా రద్దు చేసుకుంటున్నట్లే అని స్పష్టమైంది. ఈ సంచలన పరిణామం పట్ల భారత్ స్పందిస్తూ గతంలో ప్రభుత్వ స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి శ్రీలంక కట్టుబడాలని కోరింది.గతంలో ఈ పోర్టును 49 శాతం వాటాతో భారత్, జపాన్ నిర్మించి నిర్వహిస్తాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. కానీ మంగళవారం శ్రీలంక మంత్రివర్గం సమావేశమై కొలంబో తూర్పు టెర్మినల్ నూటికి నూరుపాళ్లు శ్రీలంక పోర్ట్ అథారిటీ యాజమాన్యంలోనే ఉంటుందని తీర్మానిస్తూ మినిట్స్ వెల్లడించటం షాక్ కలిగించింది. తూర్పు టెర్మినల్  కాకుండా పశ్చిమ టెర్మినల్‌ను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం కింద భారత్, జపాన్ అభివృద్ధి చేయాలని ఆహ్వానిస్తున్నట్లు మంత్రివర్గ భేటీ మినిట్స్ పేర్కొంది.కొలంబో ఓడరేవు తూర్పు టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణపై 2019లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శ్రీలంక బలపర్చాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గత నెలలో శ్రీలంక సందర్శించారు. ఈ ఒప్పందంలో భారత్‌కి చెందిన అదానీ గ్రూప్, జపాన్ భాగస్వామ్యం పంచుకున్నాయి. కాని జైశంకర్ లంక ప్రయాణం ముగిసి నెలరోజులు కాకముందే శ్రీలంక ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని తోసిరాజనడం గమనార్హం.
శ్రీలంక ప్రభుత్వం ఈ రేవు నిర్మాణంపై గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ ఇటీవలి గతంలో అనేకసార్లు ఆ దేశ నాయకత్వంతో చర్చలు జరిపినట్లు శ్రీలంకలో భారత రాయబార కార్యాలయం ప్రతినిధి చెప్పారు. కొలంబో ఓడరేవు తూర్పు టెర్మినల్ అభివృద్ధి ప్రాజెక్టును విదేశీ మదుపుదారులతో కలిసి అమలు చేయడంపై మూడు నెలల క్రితమే శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రాజెక్టును కొనసాగించాలని భారత్, జపాన్ అభిప్రాయం వ్యక్తం చేశాయి.అయితే తాజా పరిణామంపై అదానీ గ్రూప్, జపనీస్ రాయబార కార్యాలయం, శ్రీలంక అధ్యక్షుడు గొట్టభయ రాజపక్ష తమ స్పందనలను తెలపడానికి ముందుకు రాలేదు.దక్షిణాసియాపై పట్టు సాధించడానికి సాంప్రదాయికంగా ప్రత్యర్థి దేశాలైన భారత్, చైనాలు సాగిస్తున్న పోరాటంలో శ్రీలంకకు కీలకపాత్ర ఉంది. అందుకే శ్రీలంకలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేజిక్కించుకోవడంలో భారత్, చైనా పోటీ పడుతుంటాయి. భారత్ నుంచి విదేశాలకు, విదేశాలనుంచి భారత్‌కు వచ్చే పోయే ఓడలకు శ్రీలంక కీలకమైన స్టేజిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో పెరుగుతున్న చైనా ప్రభావం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది.తననుంచి తీసుకున్న రుణాలను చెల్లించడంలో శ్రీలంక విఫలం కావడంతో చైనా 2016లో శ్రీలంకలోని హంబంటోటా ఓడరేవును స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా పొరుగున ఉన్న కొలంబో పోర్ట్ టెర్మినల్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను కూడా చైనా చేపట్టడం గమనార్హం.

Related Posts