ఇంటింటి రేషన్ డ్రైవర్లకు 21 వేలు
విజయవాడ, ఫిబ్రవరి 6
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రతి నెలా ఇచ్చే చెల్లింపుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క వాహనదారుడికి ప్రస్తుతం మొత్తం రూ.16 వేలు చెల్లిస్తున్నారు. వాటిలో అద్దె కింద
రూ.10 వేలు, పెట్రోల్ నిమిత్తం రూ.3 వేలు, హెల్పర్ చార్జీల కోసం రూ.3 వేలు (మొత్తం రూ.16వేలు). వారు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, వాహనదారుడి
సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది. పెట్రోల్ కోసం రూ.3 వేలు చెల్లిస్తారు. అంటే రూ.16 వేలకు బదులు రూ.21వేలు అందజేయనున్నారు.ప్రభుత్వం తీసుకున్న తాజా
నిర్ణయంతో ఒక్కో వాహనదారుడికి నెలకు రూ.5 వేల చొప్పున అదనంగా అందుతుంది. వాహనాన్ని శుభ్రంగా ఉంచారా లేదా అనే విషయాన్ని తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. వాహనం
శుభ్రంగా లేకపోతే అదనంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం మొత్తం 9,260 మొబైల్ వాహనాలను సమకూర్చింది. ఎస్సీ
కార్పొరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్‌వార్డ్) కార్పొరేషన్ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. ఒక్కో
వాహనం ధర రూ.5,81,000 కాగా.. అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందింది. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.1,74,357.. లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలే. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు వీలుగా పౌర సరఫరాల
శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించేలా చేశారు.