విశాఖపట్టణం, ఫిబ్రవరి 8,
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసిన కేంద్రం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియను మూడు దశల్లో ఏడాదిన్నరలోపే పూర్తిచేసే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.1.75 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారాన్ని వేగంగా కదిపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రైవేటీకరణ ప్రారంభానికి తొలుత లావాదేవీల, న్యాయ సలహాదారులను కేంద్రం నియమిస్తుంది.తర్వాత కొనుగోలుకు ఆసక్తి గలవారిని ఆహ్వానిస్తూ ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’కు నోటిఫికేషన్ జారీచేస్తారు. అర్హతలను ముందే నిర్దేశించి.. అనుభవం, నెట్‌వర్క్, ఉత్పత్తి సామర్థ్యం, దేశీయ భాగస్వామ్యం వంటి షరతులను విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ బిడ్డింగ్‌కు అనుమతిస్తారు. అనంతరం స్టీల్ ప్లాంట్‌ను ఆర్థిక బిడ్ దాఖలుకు వీలు కల్పిస్తారు. ఎక్కువ మొత్తం కోట్ చేసినవారికి కర్మాగారాన్ని అప్పగిస్తారు. బిడ్డింగ్ మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వానికి చెల్లించాలి.అయితే, సంస్థ విలువలో అప్పులు పోను మిగతా మొత్తాన్ని ఒకేసారి చెల్లించి, అప్పులను వాటి కాలపరిమితి ప్రకారం చెల్లించడానికి వీలుంటుంది. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకూ స్టీల్ ప్లాంట్ విలువను లెక్కించలేదని సమాచారం. ముందే దీని విలువను ప్రకటిస్తే బిడ్డర్లు అంతకంటే కొంత ఎక్కువకు బిడ్లు దాఖలు చేస్తారని భావిస్తోన్న కేంద్రం.. అందుకే దాని జోలికి పోలేదని అంటున్నారు.స్టీల్ ప్లాంట్ షేర్‌మార్కెట్‌లో లిస్టింగ్ చేసి 10 శాతం వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించాలని తొలుత ప్రభుత్వం భావించిందని, కానీ తర్వాత సంస్థ నష్టాల్లో ఉండటంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని అంటున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థల షేర్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రంగంలో ఎఫ్‌డీఐలకున్న అనుమతులకు లోబడి విదేశీ సంస్థలకూ అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం కర్మాగారానికి ఉన్న మొత్తం భూమిని ఇవ్వరని.. ప్రస్తుత ఉత్పత్తికి, భవిష్యత్తు విస్తరణకు ఎంత కావాలో అంతవరకే ఇస్తారని పేర్కొన్నారు.ఇదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఉత్సాహం చూపుతున్నా, స్పందన అంతంత మాత్రంగానే ఉందని అధికారులు అంటున్నారు. గత ఏడాది ప్రైవేటీకరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంటే, కేవలం రూ.30వేల కోట్లే వచ్చాయి. గతేడాది అమ్మకానికి పెట్టిన సంస్థల లాభాలు సరిగా లేకపోవడంవల్లే కొనుగోలుదార్ల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మంచి డిమాండు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. సముద్రతీరంలో ఉండటం, పక్కనున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇనుప ఖనిజం అందుబాటులో ఉండటంతో దీనిపై కొనుగోలుదారులు ఆసక్తి చూపొచ్చని భావిస్తున్నారు.