తెలుగు రాష్ట్రాల్లో సూర్య భగవానుని దేవాలయాలు అరుదు. అలంటి సూర్య నారాయణ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా నందికోట్కూరు లో దివ్య క్షేత్రమై వెలుగొందుతుంది .
కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాతః కిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతారు అర్చకులు. పదమూడో శతాబ్దంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. అలసిసొలసి ఓ చెట్టు నీడన సేదతీరుతుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి...అక్కడ తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ ఆనతి ప్రకారం సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని ఐతిహ్యం.
గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయం శిధిలావస్తకు చేరుకోగా.... పదహారేళ్ళ క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రధ సప్తమినాడు ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాలనుండి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
సూర్యోదయం జరిగే తూర్పు దిక్కునే ముందుగా సృష్టించాడట బ్రహ్మ. మాఘశుద్ధ సప్తమినాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథమెక్కివచ్చి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్యవ్రతాన్నీ నిర్వహిస్తాం. ఆరోజు, తలమీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తలస్నానం చేయడం సంప్రదాయం. కొత్తబియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులమీద వడ్డించి, నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య కటాక్షం పొందుతారు.
వెళ్ళు మార్గం :- కర్నూల్ నుండి ఆత్మకూరు వెళ్ళే మార్గం లో 35 కి మీ దూరం లో నందికోట్కూరు ఉంటుంది.
ఓం నమో నారాయణాయ