ఈ దార్లో నిన్న యాభై రూపాయల నోటు పారేసుకున్నాను. నాకు కళ్లు సరిగా కనబడవు. మీకు దొరికితే దయచేసి ఈ చిరునామాకు తెచ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సాయం చెయ్యండి’... ఇంటికి వెళ్తుంటే దార్లో ఓ స్తంభానికి అతికించిన కాగితం మీద ఈ మాటలు కనిపించాయి. నాకెందుకో ఆ చిరునామాకు వెళ్లాలనిపించింది. అదో చిన్న పూరిపాక. దగ్గరికి వెళ్లి పిలిస్తే ఓ వృద్ధురాలు వచ్చింది. చూపు ఆనట్లేదు. చేతికర్రతో తడుముకుంటూ నడుస్తోంది. ‘‘ఏమీ లేదమ్మా! నువ్వు పోగొట్టుకున్న యాభై రూపాయల నోటు నాకు దొరికింది. ఇచ్చి పోదామని వచ్చాను’’ అన్నాను. ఆమె ఏడుస్తోంది. ‘‘బాబూ! ఇప్పటికిలా దాదాపు యాభై అరవై మంది వచ్చారు. ఒక్కొక్కరూ ఒక్కో యాభై రూపాయల నోటు ఇస్తున్నారు. నాకు చదవడం, రాయడం రాదు. ఆ కాగితం ఎవరు రాశారో తెలియదు’’ అంది. ‘‘పోన్లేమ్మా... తీసుకో!’’ అంటూ నోటును ఆమె చేతిలో పెట్టాను. ‘‘బాబూ! నా ఇబ్బందులు చూసి ఎవరో మహానుభావుడు అలా రాసిపెట్టి ఉంటాడు. వెళ్లేటప్పుడు అది కాస్త చించెయ్యి నాయినా!’’ అంది. ఎవరు రాశారో కానీ, దార్లో వెళ్తున్న వాళ్లలో ఎవరో ఒకరు ఆ కాగితాన్ని చూస్తారు. చూసిన వాళ్లలో కొంతమందైనా ఆమెకు సాయపడతారు. నేనా కాగితాన్ని చించేస్తే...? తన దగ్గరికి వచ్చిన వాళ్లందరికీ ఆమె ఇలాగే చెప్పి ఉంటుంది. ఒక్కరూ చించెయ్యలేదు. మరి నేనెందుకు చించాలి? ఆమెకు అందుతున్న సాయాన్ని ఎందుకు అడ్డుకోవాలి?’ ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. ఇంతలో ఒకాయన చేతిలో చిన్నకాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు. ‘సార్... ఈ చిరునామా చెప్పగలరా? పాపం ఎవరో డబ్బులు పోగొట్టుకున్నారట. నాకు దొరికాయి. ఇచ్చేద్దామని అడుగుతున్నాను’’ అన్నాడు. అది ఆ పెద్దావిడ చిరునామానే. అవును... మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. ఆ కాగితాన్ని ఎవరూ చింపరు కూడా.
* * *
ఎవరికైనా సాయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలు! స్పందించే హృదయాలెప్పుడూ స్ఫూర్తిదీపాలే.
ఓం నమో నారాయణాయ