ఆత్మశుద్ధిలేని ఆచారము, భాండ శుద్ధి లేని పాకము, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమని” వేమన్న చెప్పిన సత్యాన్ని గ్రహించాలి జనులు.
* భగవంతుని యందు మనసు లీనం చేసే ముందు చిత్తశుద్ధి అవసరమని విశ్వసించాలి. మనసంతా మంచి ఆలోచనలు నిండి ఉండడం చిత్తశుద్ధి కాదు. ఆలోచనలేవీ లేకుండా ఖాళీ చేయడాన్నే చిత్తశుద్ధిగా నిర్వచించారు పెద్దలు. ‘చిత్తశుద్ధి లేని పూజలు, సాధనల వల్ల ఆత్మజ్ఞానం కలగదని, ఆలోచనకు, మాటకు, చేతకు సమన్వయం ఏర్పడదని’ గ్రంథాలు కూడా తెలిపాయి.
“మహత్తరమైన సత్యాన్ని చూడాలంటే మనసు లోపలకు చూడాలని” శాస్త్రాలు చెప్పాయి. దుమ్ము ధూళి పట్టిన అద్దంలో ప్రతిబింబాన్ని చూడలేనట్టే అజ్ఞానాన్ని తొలగించుకోనప్పుడు పరమాత్మను దర్శించడం సాధ్యం కాదని గ్రహించాలి.
“ మనస్సు మీద దృష్టి పెట్ట గలిగితే అనంతమైన రత్నాల వంటి సంపద అక్కడే ఉందన్న’ వివేకానందుని మాటల సారాన్ని గ్రహిస్తే ఆచరణా విధానం మార్చుకోగలుగుతారు. ‘వసంత రుతువుకు ముందు వృక్షాలు పండుటాకులను రాల్చి చిగురు తొడిగినట్టు, చిత్త వృక్షము నుండి అవలక్షణములనే ఆకులను రాల్చివేసి, అఖండాత్మశక్తి సంపన్నులమనే నూతనోత్సాహమును పెంపొందించుకోవాలని’ గ్రంథాలు తెలిపిన సత్యాన్ని మననం చేసుకుంటే ఆధ్యాత్మిక మార్గం పూలబాట అవుతుంది.
‘చిత్త శుద్ధి కొరకు కర్మలు, ఏకాగ్రత కొరకు ఉపాసన చేయాలని, మోక్షం కొరకు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని ‘వేదాంత డిండిమము’ బోధించినట్టు నిష్కామ కర్మలు చేస్తూనే భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రతిఫలాన్ని భగవదర్పితం చేసినప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి.
“చిత్తశుద్ధి, మంచి మనసు ఉంటే తీర్థయాత్రలకు వెళ్లి స్నానాలు చెయ్యాల్సిన పని లేదన్న” భర్తృహరి సుభాషితాన్ని అవగతం చేసుకుంటే ఆధ్యాత్మిక జీవన విధానమూ బోధపడుతుంది.
‘చిత్తశుద్ధితో చేసే పనులకు ప్రతిఫలం దక్కుతుందని’ ఇతిహాసాలు తెలిపినట్టు అమలిన చిత్తంతో శ్రద్ధగా ఎదురు చూసిన శబరి పెట్టిన ఎంగిలిని స్వీకరించి, గంగానదిని దాటించిన గుహుణ్ణి ఆలింగనంతోనూ కరుణించాడు రాముడు.
నాలుగు రోజులుగా పస్తులున్నప్పటికీ తన ఆహారాన్ని అతిథికిచ్చిన సక్తుప్రస్థుడు స్వర్గలోకం చేరినట్టు భారతం వివరించింది.
‘ఇంద్రియాలెన్ని విధాలుగా బాధించినా ప్రయత్నంతో అదుపు చేసుకోవాలని, నీట మునిగినవాడు ఎదురీదుతూ నదిని దాటినట్టే, పాప చింతలను పరిశ్రమతో తొలగించుకున్నపుడే చిత్తశుద్ధి కలుగుతుందని’ పానుగంటి వారు వ్రాసినట్టు, ‘ఏకాగ్ర చిత్తమును గురువుగా, మనోవికాసమునకు తోడ్పడు సాంగత్య, గ్రంథ పఠనాభ్యాసులై, వైరుధ్య భావాలను అధిగమించితే ఆత్మశాంతి కలుగుతుందని” శాస్త్రాలు బోధించినట్టుగా నియమ నిష్టలు ఏర్పరచుకుని దైవానుగ్రహానికి ప్రయత్నించేవారు సఫలీకృతులు కాగలరు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో