లక్నో ఫిబ్రవరి 8
కాళికా మాత అవతారంగా చెప్పుకుంటూ చీర, గాజులు ధరించే సఖీ బాబాగా పేరొందిన పూజారి ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురైన ఘటన యూపీలోని బదౌన్ జిల్లాలో జరిగింది. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో శనివారం వెలుగుచూసిన ఈ ఉదంతం కలకలం రేపింది. మృతుడిని గత 20 ఏండ్లుగా ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తూ సఖీ బాబాగా పేరొందిన జై సింగ్ యూదవ్ (75)గా గుర్తించారు. నిందితుడు రాంవీర్ యాదవ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.సఖీ బాబాను కలిసేందుకు శనివారం జై సింగ్ యాదవ్ ఆలయానికి వచ్చాడని, ఓ వ్యవహారంపై ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో యాదవ్ కత్తితో సఖీ బాబాను పొడిచి పరారయ్యాడని చెప్పారు. యాదవ్‌ను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా దొరకలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్య కేసును నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఇంటిలో సఖీ బాబా ఒంటరిగా ఉండేవారని ఎస్పీ సంకల్ప్ శర్మ చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.