YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

200 కోట్ల అనుకుంటే 400 కోట్లు వచ్చాయి...!!

200 కోట్ల అనుకుంటే 400 కోట్లు వచ్చాయి...!!
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో పలు లేఔట్లలో మిగిలిపోయిన ప్లాట్లను ఈ-వేలం ద్వారా తలపెట్టిన విక్రయ ప్రక్రియలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆన్‌లైన్‌ వేలంలో మాదాపూర్‌లోని ప్లాట్లకు ఊహించని ధర పలికింది. కొన్ని స్థలాలు అప్‌సెట్‌ ధర కంటే రెండు రెట్లు, మూడు రెట్ల ధరలకు అమ్ముడుపోయాయి. మాదాపూర్‌ సెక్టార్‌ 1లోని 451 గజాలకు అత్యధికంగా గజానికి రూ.1,52,000లు, మాదాపూర్‌ సెక్టార్‌ 3లోని 1,052 గజాలకు అత్యధికంగా గజానికి రూ.1,19,100, చొప్పున బిడ్డర్లు ధరలు కోట్‌ చేసి సొంతం చేసుకున్నారు. అతి తక్కువగా నల్లగండ్లలోని ఓ ప్లాట్‌ గజానికి రూ.25,800లకు బిడ్డర్లు దక్కించుకున్నారు. హెచ్‌ఎండీఏ అమ్మకానికి పెట్టిన 211 ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలం ఆదివారం ప్రారంభమయింది. 74 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ నిర్ణయించిన నిర్ధారిత ధరకన్నా రెండింతలు, మూడింతలకు ప్లాట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఆది, సోమ, మంగళవారం... మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఆన్‌లైన్‌ వేలంలో తొలిరోజు మియాపూర్‌లో 49 ప్లాట్లు, చందానగర్‌లో ఆరు ప్లాట్లు, మాదాపూర్‌లో రెండు ప్లాట్లు, నల్లగండ్లలో 17 ప్లాట్లు ఈ–వేలం వేశారు. మాదాపూర్‌లో అత్యధికంగా గజానికి 1,52,000లు పలుకగా, చందానగర్‌లోని ఓ ప్లాట్‌ గజానికి అత్యధికంగా రూ.70 వేలు, మియాపూర్‌లోని మయూరి నగర్‌ లేఅవుట్‌లో అత్యధికంగా గజానికి రూ.66 వేలు, నల్లగండ్లలో అత్యధికంగా రూ.35 వేలకుపైనే ప్లాట్లను సొంతం చేసుకున్నారు. ఊహించని విధంగా ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయంపై సంస్థ ఉద్యోగులు తార్నాకలోని కేంద్ర కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. ఈ-వేలం ప్రక్రియలో హెచ్‌ఎండీఏ అంచనాల కన్నా ఎక్కువ ధరకు ప్లాట్లు అమ్ముడుపోవడంపై కమిషనర్ టీ.చిరంజీవులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషిని కొనియాడారు. దినదినాభివృద్థితో సంస్థ పూర్వవైభవాన్ని సాధించుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ఉద్యోగులను పేరుపేరునా అభినందించారు. హెచ్‌ఎండీఏ ఈ-వేలం ద్వారా మొత్తం 87వేల చదరపు గజాల ప్లాట్లను విక్రయానికి పెట్టామని, రూ.200 నుంచి రూ.250 కోట్లు సమీకరించాలని అనుకుంటే అంతకు రెట్టింపుగా అనూహ్యంగా రూ.400 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో తాము ఈ విజయం సాధించామని అభివర్ణించారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఇదే స్ఫూర్తితో కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు. 2015-16 సంవత్సరంలో సంస్థ వార్షిక ఆదాయం రూ.250 కోట్లు ఉండగా ఈ ఏడాది అనగా 2017-18కి రూ.870కోట్లకు పెరిగిందని అన్నారు.నల్లగండ్లలో హెచ్‌ఎండీఏ అప్‌సెట్‌ ధర గజానికి రూ.22 వేలు నిర్ధారిస్తే ఆన్‌లైన్‌ వేలంలో రూ.25 వేల నుంచి రూ.73 వేల వరకు బిడ్డర్లు దక్కించుకున్నారు. మియాపూర్‌లో అప్‌సెట్‌ ధర రూ.20 నుంచి రూ.25 వేలు నిర్ధారిస్తే ఆన్‌లైన్‌ వేలంలో గజానికి రూ.40 వేలకుపైగానే కొనుగోలుదారులు దక్కించుకున్నారు. మాదాపూర్‌లో రూ.30 వేలు అప్‌సెట్‌ ధర నిర్ణయిస్తే మూడింతలై గజానికి రూ.1,18,000లకుపైగానే అమ్ముడైంది. చందానగర్‌లో అప్‌సెట్‌ ధర రూ.25 వేలు నిర్ణయిస్తే కొనుగోలుదారులు రూ.52 వేలకుపైగా ధరను కోట్‌ చేసి దక్కించుకున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసి అమ్మిన ఈ లే అవుట్లలో అప్పుడూ గజానికి రూ.7వేల నుంచి రూ.12వేల వరకు అమ్ముడుపోయినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.

Related Posts