YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మే 7వ తేదీ మీటింగ్ పైనే అందరి చూపు, బెజవాడ కేంద్రంగా సౌత్ సమరం..!!

 మే 7వ తేదీ మీటింగ్ పైనే అందరి చూపు, బెజవాడ కేంద్రంగా సౌత్ సమరం..!!
దేశ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోందన్న ఆందోళనలో కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా పరిణమించింది. దక్షిణాది రాష్ట్రాల్లో దేశవ్యాప్త సగటు కంటే ప్రతి దశాబ్దంలోనూ తక్కువ శాతం నమోదవుతూ వస్తోంది. జనాభాను పరిగణనలోకి నిధుల కేటాయింపు జరిపితే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలకు సుమారు రూ.80వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడం లేదని, అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో అన్యాయం జరుగకుండా సవరణలు చేయించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బంగా, ఒడిశా రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో 2011 జనాభా ప్రకారం నిధుల కేటాయింపు జరిపితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఈ మేరకు మే 7వ తేదీ విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు హాజరుకానుండగా తమిళనాడు నుంచి వచ్చేది లేనిది స్పష్టత లేదు. దేశంలో జనాభా నియంత్రణను 1970వ దశకం నుంచి ఒక ఉద్యమంలా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు ఒకే దేశం ఒకే న్యాయం అన్న నినాదం అనుసరించి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలని లేదంటే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలు మరింత పెరిగి దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు.జనాభా తగ్గుదల కారణంగా కేంద్రం నుంచి ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయంగా నష్టపోతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల్లోనే కొంత మేర దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగిందని, 2020లో ప్రారంభం కానున్న 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భారీ నష్టం తప్పదని వారు వెల్లడిస్తున్నారు. జనాభా ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేటాయింపులు జరుపుతుందని ఇదే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ముప్పుగా మారిందని వారు పేర్కొంటున్నారు.రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చే పన్ను రాబడిలో జనాభా ప్రాతిపదికన తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఈ నిధుల్లో అత్యధిక భాగం స్థానిక సంస్థల అభివృద్ధికి వినియోగిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో గత 14వ ఆర్థిక సంఘం నిధుల వరకు 1971 లెక్కలను పరిగణనలోకి తీసుకునేవారు. తాజాగా కేంద్రం ప్రణాళిక సంఘానికి 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపునకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో దక్షిణాది రాష్ట్రాలు ఖంగుతింటున్నాయి. మొదట ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ వద్దని ప్రచారం చేసిన కేంద్రం 1980 దశకంలో ఒకరు లేక ఇద్దరు, 1990వ దశకంలో ఒక్కరు చాలంటూ జనాభా నియంత్రణకు ప్రచారం చేసింది. కేంద్ర కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాలు పాటించి జనాభా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి తక్కువ మంది పిల్లలకు కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ప్రకటించి జనాభా వృద్ధి రేటును గణనీయంగా తగ్గించాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని వారంటున్నారు. దేశంలో 1991-2001 మధ్య జనాభా వృద్ధిశాతం ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌లో 25.9 శాతం, బీహార్‌లో 28.6, గుజరాత్‌లో 22.6, మహారాష్టల్రో 22.71, మధ్యప్రదేశ్‌లో 24.30, రాజస్థాన్‌లో 28.40 ఉండగా దక్షిణాది రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 14.60 శాతం, తమిళనాడులో 11.70, కేరళలో 9.40, కర్నాటకలో 17.50గా నమోదైంది. ఆ తరువాత 2001-2011లో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌లో 20.10 శాతం, బీహార్‌లో 25.10, గుజరాత్‌లో 19.20, మధ్యప్రదేశ్‌లో 20.30, రాజస్థాన్‌లో 21.40 శాతంగా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 11.10 శాతం, తమిళనాడు 15.60, కేరళలో 4.90, కర్నాటకలో 15.70 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి శాతం సగటున 1971లో 24.80 శాతం, 1981లో 24.66. 1991లో 23.85, 2001లో 21.54, 2011లో 17.64 శాతంగా నమోదైంది.

Related Posts