YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీతో కాంగ్రెస్ కు నష్టమే...

 పార్టీతో కాంగ్రెస్ కు నష్టమే...

హైదరాబాద్, ఫిబ్రవరి 9, 
రాజన్న కూతురు.. జగనన్న వదిలిన బాణం.. వైఎస్ షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. తెలంగాణ నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ వైసీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులతో వైఎస్ షర్మిల సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు.. నేతలకు పిలుపులు అందడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.అన్న జగన్‌మోహన్ రెడ్డితో విభేదాల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు విహరించినా.. ఆమె తెలంగాణలో పార్టీ దిశగా పావులు కదపడం కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. జగన్‌తో విభేదాలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి గానీ తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా పావులు కదపడాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వైసీపీ ఆంధ్రపార్టీగా ముద్రపడడం వల్లే తెలంగాణలో కొత్తపార్టీతో చెల్లెలు రంగం సిద్ధం చేసుకుంటోందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నపై పగ తీర్చుకోవాలంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి కానీ.. తెలంగాణలో ఏం పనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అన్న వైఎస్ జగన్ కోసం షర్మిల చాలా కష్టపడిందని వీహెచ్ అన్నారు. అయితే ప్రస్తుతం జగన్, షర్మిల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నది నిజమని ఆయన చెప్పారు. అన్నపై పగ ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్ షర్మిల పార్టీ ప్రభావంపై కూడా ఆయన మాట్లాడారు.రాజశేఖరరెడ్డి నుంచి లబ్ధి పొందిన వాళ్లు ఆమెకు సహకరించే అవకాశం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఒక సామాజిక వర్గం ఆమెకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నానన్నారు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తోందన్న ఆయన.. పార్టీ పెట్టించి, ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చూస్తున్నట్లుందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలని.. లేకుంటే నష్టం జరగొచ్చన్నారు. షర్మిల పార్టీ కచ్చితంగా భవిష్యత్తులో కొంత ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related Posts